హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఆస్తి ఎంత ఉన్నా.. కూర్చుని తింటే కరిగిపోతుందంటారు. అదేరీతిన భూమి వందల ఎకరాలు ఉన్నా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే అవి హారతి కర్పూరం అవుతాయి. అందుకు నిదర్శనమే.. మియాపూర్లోని హెచ్ఎండీఏ భూములు. రెండు దశాబ్దాల కిందట రెవెన్యూ శాఖ అప్పగించిన భూమిని అధికారులు పట్టించుకోలేదు. దీంతో చుట్టూ కమ్ముకొచ్చిన కబ్జాలతో ఒకటీ.. అరా కాదు! ఏకంగా వందెకరాలకు పైగా సర్కారు భూమి మాయమైంది. ఇక్కడ ఎకరం కనీసం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే.. హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యంతో రూ. 3వేల కోట్లకు పైగా విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇటీవల ఉన్న భూమికి కూడా ఎసరు రావడంతో అధికారులు ఇప్పుడు రక్షణ చర్యలకు దిగారు. రూ. 2.65 కోట్లతో ఫెన్సింగ్ కోసం టెండర్లు పిలిచారు. మరి.. ఈ రెండున్నర కోట్లు రెండు దశాబ్దాల కిందటే వెచ్చిస్తే అంతకు వెయ్యి రెట్లకు పైగా విలువైన భూమిని కాపాడినట్లయ్యేది.
మియాపూర్లోని సర్వే నంబర్ 100, 101 సర్వే నంబర్లలో సుమారు 550 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. 2003లో అప్పటి ప్రభుత్వం ఈ భూములను హుడా (ప్రస్తుతం హెచ్ఎండీఏ)కు అప్పగించాలని నిర్ణయించింది. రెవెన్యూ శాఖ ఆ ఏడాదిలోనే ఆ భూములను హుడాకు బదిలీ చేసింది. అయితే ఆ భూముల్ని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం వినియోగించాలని గత ప్రభుత్వాలు యోచించాయి. కానీ దానిపై న్యాయపరమైన చిక్కులు తెరపైకి వచ్చాయి. ఆ భూములు తనవంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇలా సుప్రీం కోర్టు వరకు కేసుల చిక్కులు వెళ్లాయి. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో ఈ భూముల్ని వేలం వేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించినప్పటికీ సుప్రీం కోర్టులో కేసులు ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ భూముల రక్షణ చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ నిర్లక్ష్యం వహించడంతో సరిహద్దుల నుంచి కబ్జాలు ముంచుకొచ్చాయి. పక్క సర్వే నంబర్లు, బై నంబర్లతో రిజిస్ట్రేషన్లు భారీ ఎత్తున జరిగాయి. విషయం తెలిసినప్పటికీ అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో ప్రతి ఏటా కబ్జాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా వందెకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమైనట్లు అధికారుల ప్రాథమిక సర్వేలో తేలుతూనే ఉన్నది.
గత వారంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వేలాది మంది మియాపూర్ భూముల దగ్గరికి తరలిరావడం తెలిసిందే. మూడు రోజుల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దాదాపు ఆరువేల మంది వరకు అక్కడి చేరుకోవడంతో హెచ్ఎండీఏ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు భారీ ఎత్తున అక్కడికి వచ్చి చివరకు లాఠీచార్జీ చేస్తేగానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అయితే ఈ పరిణామంతో హెచ్ఎండీఏ అధికారుల్లో కదలిక వచ్చింది. ఇప్పటికైనా ఉన్న భూముల్ని రక్షించుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మియాపూర్లోని భూముల లెక్క తీస్తే ప్రస్తుతం అక్కడ 445 ఎకరాలు ఉన్నట్లుగా తేలింది. అంటే రికార్డుల్లో కంటే ఏకంగా 105 ఎకరాల భూములు చేజారిపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రూ.2.65 కోట్లతో ఆ భూమికి ఫెన్సింగ్ వేసేందుకు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ పూర్తయ్యే వరకు తాత్కాలిక రక్షణగా ఆ భూముల చుట్టూ జేసీబీతో కందకం (గుంత) తవ్వుతున్నారు. తద్వారా ఆ భూముల్లోకి ఎవరూ ప్రవేశించకుండా ఈ పనులు చేపట్టారు.
ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో ఆ విభాగానికి 8500 ఎకరాల భూములు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ వాటి రక్షణ చర్యలు మాత్రం ఇప్పుడు చేపట్టడం లేదు. కేవలం డిజిటలైజేషన్ విధానంలో మార్కింగ్ చేయాలని మాత్రమే నిర్ణయించినట్లు తెలిసింది. కానీ వీటి సరిహద్దులు కూడా నిర్ణయించి… ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తేనే ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయని పలువురు సూచిస్తున్నారు.