మేడ్చల్ కలెక్టరేట్/ కుత్బుల్లాపూర్ జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ దిశ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై జిల్లాలోని అన్ని శాఖల ద్వారా పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని, కల్తీ లేని పాలు, సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించి, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జవహర్నగర్ చెత్త డంపింగ్ చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, అత్యవసర పనుల కోసం నిధులు కేటాయించాలని చెప్పారు. మన ఊరు-మన బడి కింద పాఠశాలలో పనులు నిలిచిపోయాని వాటితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేసి విద్యార్థుల ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు.
పార్కులు ఇతర ప్రాంతాల్లో చెత్తను వేస్తున్నారని, స్వచ్ఛత, మరుగుదొడ్ల నిర్వహణ లేదని, కనీసం నీటి సరఫరా చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, అంగన్వాడీలకు వేతనాలు అందడం లేదని అన్నారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, వివేకానంద్ అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద అంగన్వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, దుస్తులు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. విద్య, వైద్యం, తదితర సమస్యలపై ప్రతి మూడు నెలలకు సమావేశం నిర్వహించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను పరిగణిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని జిల్లాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా తదితరులు పాల్గొన్నారు.