సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బంగారు నగల దుకాణాదారులను టార్గెట్ చేసుకొని నగరంలో జరిగిన మూడు దోపీడీల వెనక ఒకే ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా సభ్యులుగా అనుమానిస్తున్న పలువురు పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొంత సమాచారం లభించినట్టు తెలిసింది. గత నెల 22వ తేదీన జుబ్లీహిల్స్ రోడ్డు నం.45లో నగల దుకాణం ఉద్యోగి కండ్లల్లో కారంచల్లి బ్యాగ్ లాక్కొని పారిపోయారు. ఆ తర్వాత బ్యాగ్ దొరికింది. అదే నెల 24వ తేదీన నారాయణగూడ ఠాణా పరిధిలో బంగారు నగల దుకాణం ఉద్యోగిపై దాడిచేసిన దుండగులు 25 తులాల బంగారం లాక్కొని పారిపోయారు. ఈ నెల 5వ తేదీన మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కొరియర్ బాయ్‌పై దాడిచేసి రూ. 27.12 లక్షల విలువైన సొమ్మును దోచుకుపోయారు. కేవలం 14 రోజుల వ్యవధిలోనే ఈ మూడు దోపిడీలు జరిగాయి. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నేర స్థలం నుంచి మొదలు అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. లభించిన ఆధారాలతో ఈ మూడు ఘటనల వెనక ఒకే ముఠా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, రాచకొండ పరిధిలో జరిగిన జ్యువెలరీ షాప్ దోపిడీ కూడా ఈ ముఠా పనిగానే తొలుత భావించారు.
ఈ ఘటన తర్వాత మహంకాళి పోలీసు స్టేషన్ పరిధిలో మరో దోపిడీ జరుగడంతో.. సంబంధం లేదని నిర్ధారించారు. బాధితులు, సీసీ కెమెరాలు అందించిన సమాచారంతో నగరంలో వరుసగా జరిగిన మూడు దోపిడీల వెనక పాత నేరస్తులు ఉన్నట్టు గుర్తించారు. లభించిన ఆధారాలతో కాలాపత్తర్‌కు చెందిన పాత నేరస్తుల ముఠాను అనుమానిస్తూ ఒక్కో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తొలుత ఓ నిందితుడిని విచారించగా.. కొంత సమాచారం రావడంతో ఆ తర్వాత మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ వరుస దోపిడీలకు సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. ఈ ముఠాకు నేర చరిత్ర ఉంది. ఈ ముఠానే నేరుగా రంగంలోకి దిగి దోపిడీలకు పాల్పడిందా.. ఇతర ముఠాలతో చేయి కలిపి నేరాలు చేసిందా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అదేక్రమంలో ఈ ముఠాకు అంతర్రాష్ట్ర ముఠాలతో సంబంధాలు ఉన్నాయా.. అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, ముఠా సభ్యుల్లో చాలా మందిపై ఎన్బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. దర్యాప్తులో పురోగతి కనిపిస్తుంది.. త్వరలోనే నగరంలో జరిగిన మూడు దోపిడీల మిస్టరీ వీడే అవకాశం ఉన్నదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.