సిటీబ్యూరో, డిసెంబరు 9 (నమస్తే తెలంగాణ): గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఆబ్కారీ అధికారులు ‘ఆపరేషన్ ధూల్‌పేట్’ పేరుతో సోమవారం పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి మంగళ్‌హాట్, ధూల్‌పేటతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆబ్కారీ జాయింట్ కమిషనర్ ఖురేషి, సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్లు స్వయంగా తనిఖీల్లో పాల్గొని గంజాయి విక్రయా ల్లో పేరుమోసిన నేరస్తులు, పాత నేరస్తుల నివాసాలను తనిఖీ చేశా రు. ఈ తనిఖీల్లో కిలో గంజాయి పట్టుబడింది. కాగా.. గంజాయి డాన్ అంగూర్‌బాయి ఇంటిని తనిఖీ చేసిన అధికారులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆబ్కారీ జేసీ ఖురేషీ, సౌత్‌వెస్ట్‌జోన్ డీసీపీ చంద్రమోహన్లు మాట్లాడుతూ.. గంజాయి విక్రయాలు మానకపోతే ఇక నుంచి నిందితులకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తామని, దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయిని పూర్తిగా నిర్మూలించే వరకు దాడులు కొనసాగిస్తామని, నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని, ప్రవర్తన మార్చుకోకపోతే ఇక నుంచి పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌లో ఉన్నతాధికారులతోపాటు అదనపు ఎస్పీ భాస్కర్, ఏసీ అనిల్‌కుమార్ రెడ్డి, గోషామహల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ధూల్‌పేట ఎక్సైజ్ ఇన్చార్జి ఈఎస్ అంజిరెడ్డి, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, మంగల్హాట్ సీఐ మహేశ్, ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఒ మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.