సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎస్టీపీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. పెద్ద చెరువు, నల్ల చెరువు, ఫతేనగర్ ఎస్టీపీలను మంగళవారం ఆయన పరిశీలించారు. తుది దశకి చేరుకున్న పనులకు అనుగుణంగా కార్మికులు, సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని ఎండీ దానకిశోర్ సూచించారు. అవసరమైతే రెండు షిప్టుల్లో పని చేయాలని, రాత్రి వేళల్లో పనులు చేయడానికి వీలుగా లైటింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సివిల్ పనులు పూర్తయిన వాటిల్లో యంత్రాల బిగింపు పనులు మొదలు పెట్టాలన్నారు.
విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్, కేబులింగ్ పనుల్ని తొందరగా పూర్తి చేయాలని సూచించారు. అంతర్గత రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, సుందరీకరణకు గార్డెనింగ్, ల్యాండ్‌స్కేప్ పనులు చేపట్టాలని ఎండీ తెలిపారు. పని ప్రదేశాల్లో కచ్చితమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎంలు సుజాత, రఘు, జీఎం, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.