SPDCL | సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) : విద్యుత్ ఉద్యోగ సంఘాల కోసం నిర్మించిన భవనం చెప్పుకొని మురువా.. చూసుకొని ఏడువ అన్న చందంగా మారింది. నిర్మాణం పూర్తయినా భవనాన్ని సదరు సంఘాలకు కేటాయించడంలో అధికారులపై ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. తమ అనుబంధ సంఘానికే మొత్తం భవనాన్ని ఇవ్వాలంటూ అధికారపార్టీ టిజిఎస్పిడిసిఎల్ అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అసలు సాక్షాత్తు చీఫ్‌సెక్రటరీ చెప్పినా.. అధికారికంగా లేఖలు పంపినా.. సంఘాలకు వారి వారికి కేటాయింపుల ఆధారంగా అప్పజెప్పాల్సిన ఫ్లోర్ల విషయంలో అధికారులు మీన మేషాలు లెక్కపెడుతున్నారు. గతేడాదే ఆ భవనాన్ని అప్పగించాల్సి ఉండగా, అధికార పార్టీకి చెందిన కార్మిక సంఘం ఒత్తిడితో దాని అనుబంధ సంఘానికే ఆ భవనాన్ని మొత్తం కట్టబెట్టాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు కేటాయింపు జరిగిన మిగిలిన ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడు సంఘాలను సమన్వయం చేసే ప్రయత్నం చేసినా అధికారపార్టీ అనుబంధ సంఘం కోరుతున్న ప్రకారం చేస్తే మొత్తం భవనమే ఇవ్వాల్సి ఉండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో భవన కేటాయింపు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
అన్ని హంగులతో నిర్మించినా…!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిష్ఠాత్మకంగా సచివాలయ భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన క్రమంలో నాడు టీజిఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న పలు విద్యుత్ ఉద్యోగ సంఘాలకు చెందిన భవనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మిస్తుందని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఏడాది కాలంలోనే సెక్రటరియేట్ వద్ద రోడ్ల భవనాల శాఖ ద్వారా సిల్ట్ 5 భవన నిర్మాణం చేపట్టి హామీ నిలబెట్టుకున్నారు. ఒక్కో ఫ్లోర్ 1414.27 చొప్పున మొత్తం 8,485.62 ఎస్ఎఫ్టీలో భవనాన్ని నిర్మించారు.
అందులో సిల్ట్ (గ్రౌండ్ ఫ్లోర్) పార్కింగ్ కోసం, మొదటి అంతస్తు కార్మిక సంఘాల మీటింగ్ హాల్, రెండో అంతస్తు తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, మూడు, నాలుగో అంతస్తులు టీఎస్స్టేట్ ఎలక్టిస్రిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327, ఐదో అంతస్తు విద్యుత్ ఏఈల అసోసియేషన్‌కు కేటాయించారు. ఈ భవన నిర్మాణం 2023 నవంబర్ నెలాఖరులోనే పూర్తయ్యింది. భవనాన్ని కేటాయించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలకు అప్పగించేందుకు గాను జనరల్ అడ్మినిస్టేష్రన్ డిపార్ట్మెంట్ గత ఏడాదే చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. దానిని పరిశీలించిన సీఎస్ వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని (మెమో నం. 5687/ఎస్బీ/2024) ద్వారా ఆర్ అండ్ బీకి సూచించింది. దీంతో కేటాయించిన ఉద్యోగ సంఘాలకు భవనాన్ని అప్పగించాల్సిందిగా ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎల్ ఆర్. నం. ఏఈఈ/డీబీ/ఈఈ/ఎఫ్‌బీడీ/టీఎస్ సెక్రటేరియేట్/2024-25, తేది. 18-12-2024)తో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి లేఖ రాసింది.
జాప్యం చేయడం ఆ సంఘం కోసమేనా..!
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో ఏడాది కాలంగా ఆయా ఉద్యోగ సంఘాలకు కేటాయించకుండా నాన్చుతూ వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎస్ నుంచి లెటర్ వచ్చిన వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండగా, రెండేండ్లు పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మూడు యూనియన్లకు ఫ్లోర్ల కేటాయింపునకు సంబంధించి ఆర్ అండ్ బీ నుంచి లేఖ వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలైంది. ఎక్కువ స్థలం పోయింది. కాబట్టి, మొత్తం బిల్డింగ్ తమకే కావాలని 327 సంఘం పట్టుబడుతుంటే తమకు కేటాయించిన ఫ్లోర్లను తాము స్వాధీనం చేసుకుంటామని మిగతా రెండు సంఘాలు చెబుతున్నాయి. అయితే, ఈ వ్యవహారం కొంత ఇబ్బందిగా ఉండటతో సీఎండీ ముషారఫ్ ఫరూఖి సంఘాలను సమన్వయం చేసి వారి అభిప్రాయాలను తీసుకోవలసిందిగా సీజీఎం హెచ్ఆర్డీ భాస్కర్, ఎస్ఈ సివిల్ శ్రీనివాసరావులను కమిటీగా నియమించారు.
ఈ నెల 3న కార్పొరేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో మూడు యూనియన్ల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అంతకు ముందు నుంచే ఈ సంఘాలకు భవనం ఇవ్వకుండా మొత్తం తమకే కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘానికి చెందిన సంఘం నేతలు ఒత్తిడి తెస్తున్నారని మిగతా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం భట్టి కూడా అన్ని సంఘాలు కేటాయింపుల ప్రకారమే తీసుకోవాలంటూ చెప్పినా, అధికార పార్టీ ఒత్తిళ్లు మాత్రం తగ్గడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కూడా మాట్లాడకుండా ఒక్క సంఘానికే మొత్తం భవనాన్ని కట్టబెట్టేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఇతర సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. తక్షణమే తమకు కేటాయించిన భవనాన్ని అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
మినట్స్ తీసుకున్నాం..సీఎండీకి పంపించాం
మూడు సంఘాలను పిలిచి సమావేశం నిర్వహించాం. ఇందులో ముగ్గురి అభిప్రాయాలు తీసుకున్నాం. తమ సంఘానికి సంబంధించిన స్థలం ఎక్కువగా పోయిందని, అందుకే మొత్తం తమకే ఇవ్వాలని ఒకరు చెబుతుంటే ఇద్దరు మాత్రం తమకు కేటాయించిన ఫ్లోర్లను అప్పగించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని మినట్స్ రూపంలో సీఎండీకి పంపించాం. అయితే, ఆర్ అండ్ బీ వాళ్లు మాతో ఒప్పందం ప్రకారం, 10 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తామని చెప్పినంతగా బిల్డింగ్ నిర్మించ లేదు. కేవలం ఆరు నుంచి ఏడువేల చ.అ.ల్లో బిల్డింగ్ ఉంది. దీనిని ఎలా పంపకం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవైపు నిర్మాణం చేయడమే కాకుండా అలాట్మెంట్ కూడా వాళ్లే చేసి ఇచ్చారు. మా సంఘాల్లో గొడవ పెట్టారు. ఈ విషయంపై నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకోవాలి.
– శ్రీనివాసరావు, ఎస్ఈ (సివిల్);