సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల తుటాలు మళ్లీ పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం స్టాండింగ్ కమిటీ అంశాల్లో మళ్లీ పదకొండు చెరువులనే పరిరక్షిస్తామని అధికారులు ప్రతిపాదనలు పెట్టారు.
ఐతే గత స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంలో మేయర్ వర్సెస్ ఎంఐఎం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, మళ్లీ ఆ ప్రతిపాదనలతోనే స్టాండింగ్ కమిటీ ముందుకు రావడం, స్టాండింగ్ కమిటీ సమావేశంలో 8 మంది సభ్యులతో ఎంఐఎం బలంగా ఉండడంపై ఈ అంశం ఆమోదం పొందడంపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవంగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయా 13 చెరువుల పరిరక్షణలో టెక్నికల్ కన్సల్టెంట్‌గా నీరి (జాతీయ పర్యావరణ, ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ)ని నియమించుకుని చెరువుల నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరపడంతో పాటు ఇరిగేషన్ సమన్వయంతో సంబంధిత చెరువుల ఆక్రమణకు గురి కాకుండా పక్కాగా పరిరక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ఇందుకోసం రూ. 55 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఐతే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 13 చెరువులతో పాటు అదనంగా కొన్ని చెరువులను చేర్చాలని పట్టుబట్టారు. ఈ సమయంలో మేయర్‌కు, ఎంఐఎం సభ్యుల మధ్య మాటల యుద్దం నడిచింది. చివరకు ఈ ప్రతిపాదనను కమిటీ పక్కన పెట్టింది. ఈ లోగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రావడం, ఫలితాలు వెలువడి కోడ్ ముగియడంతో స్టాండింగ్ కమిటీ సమావేశం ముహుర్తం కుదిరింది.