సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9.407కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ పోలీసుల కథనం ప్రకా రం..బీహార్ ప్రాంతానికి చెందిన అర్జున్‌కుమార్, రాహుల్ పండరి ఉపాధికోసం కొంత కాలం క్రితం నగరానికి వలస వచ్చి, కాచిగూడలోని ఎడన్ బాగ్‌లో నివాసం ఉంటూ, వేర్వేరు చోట్ల సెక్యూరిటీ గార్డ్లుగా పనిచేస్తున్నారు.
వచ్చే జీతం సరిపోకపోవడంతో ఇద్దరు కలిసి గంజాయి విక్రయాలకు పాల్పడటం మొదలు పెట్టారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్ టీఎఫ్ పోలీసులు రాహుల్ పండరి ఇంటిపై దాడు లు జరిపారు. అర్జున్‌కుమార్ వద్ద గంజాయి ఉందని తెలుసుకున్న ఆబ్కారీ పోలీసులు రామ్‌కోటిలోని ఎడంబాగ్, కాచి భవన్లో నివాసం ఉంటున్న అర్జున్‌కుమార్ ఇంటిపై దాడులు జరిపి 7.20కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అర్జున్కుమార్ను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును నారాయణగూడ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.
ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జియాగూడ, రాధాకృష్ణ గోశాల వద్ద గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ధన్రాజ్సింగ్ను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.098కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడికి సహకరిస్తున్న జామ్వాల అనిల్ సింగ్‌పై సైతం కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి తెలిపారు. తుని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్ ప్రాంతంలోని ఒక హాస్టల్లో నివాసం ఉంటున్నారు.
అయితే వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ కుమార్ తుని ప్రాంతం నుంచి గంజాయి తీసుకురాగా శ్రీసాయి మణికంఠ, బన్నీ అనే ఇద్దరు యువకుల ద్వారా పీజీ హాస్టల్ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు చేపడుతున్నాడు. సమాచారం అందుకున్న ఏసీ అండ్ ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చందర్, ఎస్సై అఖిల్, వెంకట్లు తమ సిబ్బందితో కలిసి హాస్టల్‌తో పాటు మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో తనిఖీలు చేపట్టి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.109 కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బాలానగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.