సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఎక్కడ దాచినా ఆబ్కారి అధికారులు పట్టుకుంటుండడంతో ఇక దేవుడే దిక్కనుకుని, పూజా మందిరంలోని దేవుళ్ల చిత్రపటాల వెనక గంజాయిని దాచిపెట్టిన ఒక ఘరానా పాతనేరస్తుడు ఆబ్కారీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తప్పు చేసినప్పుడు దేవుడు కూడా కాపాడలేడనుకుని, గత్యంతరం లేక చేసిన నేరాన్ని అంగీకరించిన ఘటన ధూల్‌పేటలో శనివారం చోటుచేసుకుంది.
ఎస్టీఎఫ్ ఏఈఎస్, ఆపరేషన్ ధూల్‌పేట ఇన్చార్జి నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం…ధూల్‌పేట, ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన రోహన్ సింగ్ పాత నేరస్తుడు. అయితే గత కొంత కాలంగా నిందితుడు ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి ధూల్‌పేటలో విక్రయిస్తున్నాడు. ఈ మేరకు పక్కా సమాచారం అందుకున్న ఆబ్కారి ఎస్టీఎఫ్ పోలీసులు శుక్రవారం రాత్రి రోహన్సింగ్ నివాసంపై దాడులు జరిపి, ఇళ్లు మొత్తం సోదా చేశారు. కాని ఇంట్లో ఎక్కడ కూడా గంజాయి జాడ దొరకలేదు.
దీంతో అనుమానం వచ్చిన ఎస్టీఎఫ్ బృందం నిందితుడి ఇంటిలోని పూజా మందిరాన్ని తనిఖీ చేయగా దేవుళ్ల చిత్రపటాల వెనక పేపర్లలో చుట్టిన గంజాయి కట్టలు బయటపడ్డాయి. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు రోహన్సింగ్తో పాటు యశ్వంత్‌సింగ్‌ను అరెస్టు చేసి, పూజా మందిరంలో లభించిన 10.934కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడికి గంజాయి సరఫరా చేస్తున్న ఒరిశాకు చెందిన స్వప్న మండల్, రాజా వీర్ భక్రి, నగరానికి చెందిన రోహిత్‌లపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఈఎస్ అంజిరెడ్డి తెలిపారు.
ధూల్‌పేట, శివలాల్ నగర్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న సంకీర్ సింగ్, సుశీల్ సింగ్, సరితా, ఒడిశాకు చెందిన స్వప్న మండల్ అలియాస్ మీనా బాయిలను ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 10.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో పట్టుబడిన గంజా యి విలువ రూ.10.75 లక్షలుగా ఉంటుందని ఆబ్కారీ అధికారులు తెలిపారు.
ధూల్‌పేట, బలరాం గల్లి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న పవన్ సింగ్ ఇంటిపై ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 2.186కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. అంతే కాకుండా గంజాయి విక్రయాలకు సహకరిస్తున్న దుర్గా భవానీ, కౌశిక్ సింగ్, శ్వేతా బాయ్, అఖిలేష్, మనో సింగ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు.