సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): సినీ హీరోయిన్లా ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తుంది. అందచందాలతో యువకులను ఆకర్షిస్తుంది. ఇన్‌బాక్స్‌లోకి రాగానే మాటల్లో పెట్టి.. మెలమెల్లగా గంజాయి వ్యాపారంలోకి దింపుతుంది. అలా చేస్తూ పెద్ద ఎత్తున గంజాయిని రాష్ర్టాలు దాటిస్తున్న ఒడిశాకు చెందిన ఓ లేడీడాన్ను ఆబ్కారీ పోలీసులు అరెస్టు చేశారు.
ఎస్టిఎఫ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం…ఒడిశా రాష్ట్రం కుర్థా జిల్లా, కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీతా సాహు అలియాస్ గీతా సాహు గత 4 ఏండ్ల నుంచి హోల్ సెల్ గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నది. భువనేశ్వర్‌కు దగ్గరగా ఉండడంతో సంగీతా సాహు దేశంలోని పలు ర్రాష్టాలకు చెందిన గంజాయి వ్యాపారులతో పరిచయాలు ఏర్పర్చుకుని వారికి పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేస్తున్నది.
తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో నిందితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందచందాలతో రీల్స్ చేస్తూ యువతను ఆకర్షిస్తున్నది. వారితో పరిచయాలు ఏర్పర్చుకుని ఇన్‌బాక్స్‌లో చాట్ చేస్తూ ఔత్సాహికులైన వారిద్వారా ఆయా ప్రాంతాలకు గంజాయి సరఫరా చేయిస్తున్నది. ఈ క్రమంలోనే 2022లో ఒడిశా నుంచి ముంబైకి గంజాయి రవాణా చేస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులకు పట్టుబడింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించిన సమయంలో ధూల్‌పేటకు చెందిన శీలాబాయి, నేహాబాయి, ఇషికాసింగ్, విశాల్సింగ్లతో పరిచయం ఏర్పర్చుకున్నది.
జైలు నుంచి విడుదలైన తరువాత వారికి గంజాయి సరఫరా చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ధూల్‌పేటలో పట్టుబడిన నాలుగు గంజాయి కేసులు సహా రైల్వే పోలీసు స్టేషన్లో కలిపి మొత్తం నగరంలో ఐదు గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అయితే నగరంలో గంజాయి విక్రయాలను కట్టడి చేయడంతో పాటు అసలు సరఫరాదారులపైననే ఉక్కుపాదం మోపాలని ఆబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్ ధూల్‌పేట ప్రత్యేక బృందం ఒడిశా వెళ్లి, ఎట్టకేలకు బుధవారం సంగీతాసాహును అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ఒడిశాకు వెళ్లిన టీమ్ లీడర్ అంజిరెడ్డి, ఎస్సై సైదులు, హెడ్ కానిస్టేబుల్ కె శ్రీధర్ , కానిస్టేబుళ్లు మహేష్ , అరుణ్ , మంగ తదితరులను ఆబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.