రవీంద్రభారతి, డిసెంబర్ 4: అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ ఎక్సైజ్ శాఖ ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఓమర్అలీ అని కమిషనర్లు, ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు కాని.. ఓమర్ అలీ మాత్రం ఏడాదిగా కాదు ఏకంగా 20 ఏండ్లకు పైగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నాడని, సీఐలు, ఎస్ఐలు ఆయన పేరు చెబితేనే వణికిపోతున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ అన్నారు. బుధవారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అడిగినంత ముట్టజెప్పకపోతే పదోన్నతులనే రివర్స్ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు.
ఎవరూ వేలు పెట్టలేని సర్వీస్ బుక్కులో కూడా పుట్టిన తేదీలు మార్పులు చేసిన ఘనుడని, సీనియార్టీ లిస్టులోనూ భారీగా అవకతవకలకు పాల్పడి చాలా మందికి అన్యాయం చేశారని, 2005 వరకు ప్రమోటివ్స్, ఆ తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే తీసుకొని జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఓమర్అలీ అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. చర్యలు తీసుకోకుంటే బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సయ్యద్ ఓమర్ అలీ అవినీతి లీలలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని చెప్పారు. ఈమేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఓమర్ అలీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. కార్యక్రమంలో రామ్మూర్తి గౌడ్, సాయిబాబా, రఘురాంగౌడ్, వెంకట్, వెంకన్న, పి.బడేసాబ్, మహేశ్ పాల్గొన్నారు.