సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి కల్తీ కల్లు మరణాలతో ఎట్టకేలకు ఆబ్కారీ శాఖ మత్తు వీడింది. పది మంది ప్రాణాలు పోతే తప్పా అటు ఎక్సైజ్ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని కళ్లు తెరవలేదు. గత వారం రోజులుగా కల్తీ కల్లు బాధితుల్లో జరుగుతున్న వరుస మరణాలపై పరోక్షంగా స్పందించిన అధికారులు దాడుల పేరుతో కల్తీ కల్లు వ్యాపారులను అలర్ట్ చేసి, అడపా దడప కేసులతో హెచ్చరికలు జారీచేశారు. కొందరు అధికారులైతే ఏకంగా నగరంలోని కొన్ని కల్తీ కల్లు మాఫియాలకు దాడులకు సంబంధించి మందస్తు సమాచారం ఇవ్వడమే కాకుండా ‘ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు.. ఒక నాలుగు రోజులు ఓపిక పట్టండి… దుకాణాలు మూసేయండి…. లేకపోతే మీ ఇష్టం’ అంటూ మత్తుగా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం నగరంలోని సుమారు 90 కల్లు దుకాణాలు మూతపడ్డాయి. అంతే కాకుండా నగర శివారు ప్రాంతాల్లోని కల్లు దుకాణాలలో అల్ఫాజోలం, డైజోఫామ్, సీహెచ్ వంటి మత్తు పదార్థాలను కలపడం నిలిపివేశారు. దీంతో మరో కొత్త సమస్య వచ్చిపడింది. మత్తు కలిపిన కల్తీ కల్లుకు అలవాటు పడిన జనం ఆ కల్తీ కల్లు లభించకపోవడంతో విత్డ్రాల్ సిమ్టమ్స్కు గురై పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు కల్లు దుకాణాలను మూసివేయడంతో కల్లు ప్రియులందరూ శివారు ప్రాంతాల్లోని కల్లు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. కొందరు శివారుకు వెళ్లి కల్లు తాగుతుండగా, మరికొందరు ఇళ్లకు తెచ్చుకుని సేవిస్తున్నారు. అయితే ఈ కల్లులో మత్తు పదార్థం లేకపోవడంతో ఇంతకాలం మత్తుకు అలవాటుపడిన వారు బట్టలు చింపుకోవడం, అరవడం, కుటుంబ సభ్యులపై దాడులు చేయడం, తమకు తాము గాయపర్చుకోవడం తదితర లక్షణాలతో పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖాన, ఉస్మానియా, గాంధీ దవాఖానలు విత్డ్రాల్ సిమ్టమ్స్ బాధితులతో నిండిపోతున్నాయి.
కల్తీ కల్లు పాపం.. ప్రభుత్వం, ఆబ్కారీ శాఖదే అని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను రూపమాపుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మరోపక్క జనానికి కల్లు ద్వారా డ్రగ్స్ అలవాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈగల్ వంటి ప్రత్యేక విభాగాల పేరుతో పట్టుకుంటున్న డ్రగ్స్‌కు కల్లులో కలుపుతున్న డ్రగ్స్‌కు ఏంటి తేడా అని ప్రశ్నిస్తున్నారు. కుడి చేతితే డ్రగ్స్ పట్టుకుంటూనే ఎడమ చేతితో జనానికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్లు బాధితులు ఎంతకాలం నుంచి మత్తుకు అలవాటు కాకపోతే ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. కొంత మంది పాలకులు, అధికారులు కల్తీ కల్లు మాఫియాలతో చేతులు కలుపుతూ మత్తు కల్లును జనానికి అలవాటు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. కొకైన్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు, ప్రభుత్వం ప్రాణాంతకమైన ఆల్ఫాజోలం, క్లోరోహైడ్రేడ్(సీహెచ్), డైజోఫామ్ వంటి వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని, ఒకవేల వాటిపై నిఘా పెడితే జనం పిచ్చివాళ్లయ్యేంతలా మత్తు కల్లుకు ఎలా అలవాటు పడ్డారో ఆబ్కారీ అధికారులు, ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. కిలోల కొద్ది ఆల్ఫాజోలం, డైజోఫామ్, సీహెచ్ పట్టుబడిన కేసుల్లో లోతైన విచారణ జరిపినప్పుడు, ఈ మత్తు పదార్థాలను కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు నిందితులు అంగీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈకేసుల్లో సంబంధిత అధికారులు సదరు కల్లు దుకాణాలపై చర్యలు తీసుకుని ఉంటే ఈ కల్తీ కల్లు విక్రయాలు జరిగేవి కావు. కల్తీ కల్లు ఘటనలకు కొందరు రాజకీయ, కుల సంఘాల నాయకులతో పాటు ఆబ్కారీ, పోలీసు శాఖలోని కొందరు అధికారులదే పూర్తి బాధ్యత అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలను నిరోధించేందుకు పెద్ద ఎత్తున వేర్వేరు పేర్లతో దర్యాప్తు, నిఘా ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. పోలీసు, ఆబ్కారీ శాఖతో పాటు ప్రత్యేకంగా యాంటి నార్కొటిక్ విభాగం(ఈగల్) కూడా పనిచేస్తుంది. ఆబ్కారీ శాఖలో ఎస్టీఎఫ్, డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఇన్ని ఎజెన్సీలు పనిచేస్తున్నాగాని ఇంత పెద్ద ఎత్తున మత్తు కలిపిన కల్లు విక్రయాలు ఎలా జరుగుతున్నాయో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు జరిగిన 9మంది మరణాలకు బాధ్యులెవరో తెలియడం లేదు.