సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): ‘ఆ కల్లు దుకాణాలపై కేసు నమోదైంది వాస్తవమే.. ఏడాదిన్నర క్రితం కేసు నమోదైంది కాని ఇప్పటి దాక అది ఎటూ తేలడం లేదు. వారు కోర్టులో డబ్ల్యూపీవేశారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏమి చేయాలో అర్థం కాక మేము వాటి జోలికి వెళ్లడం లేదు. అదే దుకాణంలో నెల రోజుల క్రితం ప్రాణాంతకమైన సీహెచ్ దొరికిన మాట కూడా వాస్తవమే కాని అది కల్లు దుకాణంలో కాదు. పక్కన దొరికింది.’ ఇది నగరంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కల్తీ కల్లు దుకాణాలపై సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓల వింత వివరణ.
నెల క్రితం ప్రాణాంతకమైన క్లోరోహైడ్రేడ్ లభించిన కల్లు దుకాణాలకు ఎలా అనుమతి ఇచ్చారని ‘నమస్తే తెలంగాణ’ సంబంధిత ఎక్సైజ్ ఎస్హెచ్ఓలను ప్రశ్నించగా మైండ్ బ్లాకయ్యే వింతైన సమాధానలు ఇస్తున్నారు. కల్తీ కల్లుకు ప్రజల ప్రాణాలు పోతున్నా, కల్లు మాఫియా మత్తులో జోగుతున్నారు. ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో క్రమంగా కొనసాగుతున్న కల్తీ కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోకుండా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వారికి సహకరిస్తున్నారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 8మంది మృత్యువాత పడినా సంబంధిత అధికారుల్లో చలనం లేదంటే సంబంధిత అధికారులపై కల్లు మాఫియా ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్హెచ్ఒల వింత సమాధానాలు వారి మాటల్లోనే…
‘చిక్కడపల్లి కల్లు కంపౌండ్పై సీహెచ్ కేసు నమోదు కాలేదు. అసలు సీహెచ్ కల్లు దుకాణంలో దొరకనే లేదు. పక్కన ఎక్కడో దొరికితే లొకేషన్ రాశారు అంతే. ఈ దుకాణంపై ఇప్పుడెలాంటి కేసు నమోదు కాలేదు. ఎన్నికల సమయంలో నమోదైంది. దానిపై ఆ సొసైటీ వాళ్లు కోర్టకెళ్లి డబ్ల్యూపీ తెచ్చుకున్నారు. కోర్టు సంబంధిత డీసీలకే రాసింది. కాని డీసీ అనుమతి రిజక్ట్ చేశారు. వారు మళ్లీ కోర్టులో డబ్ల్యూపీ వేశారు. ఇప్పటివరకు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కనీసం కేసు బెంచ్‌మీదకు కూడా రావడం లేదు. కోర్టు పరిధిలో ఉందని మేము కూడా వాటి జోలికి వెళ్లడం లేదు. ఏమి చేయాలో మాకు కూడా అర్థమవడం లేదు. ఏడాది కాలంగా అలాగే నడుస్తున్నాయి. ఒక్క చిక్కిడపల్లినే కాదు నగరంలోని దాదాపు అన్ని కల్లు దుకాణాలను అలానే నిర్వహిస్తున్నారు’.
నేను ఈ మధ్యనే వచ్చాను. గతం నుంచి కూడా అడిక్‌మెట్ కల్లు దుకాణం నడుస్తోంది. గత నెలలో ఈ దుకాణంలో సీహెచ్ దొరికిన మాట వాస్తవమే. కాని దానికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా రాలేదు. అందుకని మేము ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దుకాణంపై ఎన్నికల టైమ్‌లో కేసు నమోదైంది. వారు కోర్టుకెళ్లి డబ్ల్యూపీ తెచ్చుకున్నారు. కోర్టు నుంచి అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. కానీ విషయం కోర్టు పరిధిలో ఉందని మేము వాటి జోలికి వెళ్లడం లేదు.
ముషీరాబాద్, కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఒల ఈవిషయాలపై వివరణ ఇస్తూ.. జూన్ నెలలో ఎస్టీఎఫ్ అధికారులు కాచిగూడ స్టేషన్ పరిధిలోని అడిక్‌మెట్ కల్లు దుకాణంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో అక్కడ విక్రయిస్తున్న కల్లులో ప్రాణాంతకమైన సీహెచ్(క్లోరో హైడేడ్) కలిపినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో ఎస్టీఎఫ్ అధికారులు అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు కల్లు చిక్కడపల్లి నుంచి వచ్చినట్లు తెలపడంతో అడిక్‌మెట్ కల్లు దుకాణంపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.
అంతే కాకుండా అడిక్‌మెట్ కల్లు దుకాణంలో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బృందం వెంటనే చిక్కడపల్లి కల్లు దుకాణంపై దాడులు జరిపి, అక్కడ విక్రయిస్తున్న కల్లును పరీక్షించారు. అక్కడ కూడా ప్రాణాంతకమైన సీహెచ్(క్లోరోహైడ్రెడ్) కలిపినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో ఎస్టీఎఫ్ అధికారులు సదరు కల్లు దుకాణంపై, నిర్వాహకులైన బాలరాజ్‌గౌడ్, ఐలయ్యగౌడ్లపై కేసు నమోదు చేసి, కల్లు దుకాణం సీజ్ చేశారు. కాని సీజ్ చేసిన మూడు రోజులకే కొందరు రాజకీయ, కల్లు మాఫియా ఒత్తిడి మేరకు ఈ కల్లు దుకాణాలు యథేచ్చగా తెరిచుకున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులపై కొందరు కల్లు సొసైటీల నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అయితే న్యాయస్థానం నిర్ణయాధికారిన్ని సంబంధిత డిప్యూటీ కమిషనర్లకు ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో నిర్వాహకులు ఆబ్కారీ శాఖను ఆశ్రయించగా అప్పటి డీసీలు కల్లు దుకాణ నిర్వాహకుల అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో మరికొంత మంది వ్యాపారులు మళ్లీ కోర్టును ఆశ్రయించగా ఇప్పటి వరకు కోర్టు మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు.
అంటే కేసులు నమోదైన కల్లు దుకాణాలను తెరిపించాలని అధికారులకు గాని వ్యాపారులకు గానీ ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు. దీంతో కొందరు రాజకీయ, కల్లు మాఫియాకు తలొగ్గిన ఆబ్కారీ శాఖ అక్రమంగా సాగుతున్న కల్లు దుకాణాలకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు అధికారులు కల్లు మాఫియాలు అందించే మామూళ్ల మత్తులో చట్టాలను సైతం మరిచిపోవడం, వాస్తవాలను బుట్టదాఖలు చేయడం విచారకరం.