సికింద్రాబాద్, ఏప్రిల్ 2: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం తెలిపే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వేలెత్తి ప్రభుత్వ తప్పిదాన్ని చూపిస్తే కేసులు పెట్టడం రేవంత్‌రెడ్డి అలవాటు చేసుకున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఓయూ ఠాగూర్ అడిటోరియంలో జరుగుతున్న డుసిమస్ వూయ్ లీడ్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఎంతో మంది త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రమని, ఈ రాష్ర్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాగరహారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి న్యాయవాదులు అండగా నిలిచారని గుర్తు చేశారు. దేశంలో 5కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికీ పేదవాడికి న్యాయం జరగడం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో ముఖ్యమైనది న్యాయవ్యవస్థ అని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే తనకు పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత ఘటనలు గుర్తుకొచ్చాయని చెప్పారు.