సిటీబ్యూరో, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: ఈనెల 6న వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించే నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సీపీ విక్రమ్ సింగ్మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిడ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్‌మ్యాప్‌ను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలాపూర్, చార్మినార్ సరిల్, మోజంజాహీ మారెట్, తెలుగు తల్లి ఫె్లై ఓవర్ ఊరేగింపు మార్గాలను పరిశీలించి విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు ఆధారంగా.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు చేశారు. తదనంతరం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాల ఊరేగింపులు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర చివరిరోజున 30వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ తెలిపారు. ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరుల శోభాయాత్ర సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి అయ్యేలా చూస్తామని చెప్పారు.
చివరిరోజు 50వేల విగ్రహాల నిమజ్జనం..
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశామని కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. గ్రేటర్లో అన్ని ప్రధాన లేక్‌లలో 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. 56,187 టెంపరరీ లైట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ టీంలను, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
దాదాపు 303 కిలోమీటర్ల మేర ప్రధాన గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గంలో ఊరేగింపు 160 గణేష్ యాక్షన్ టీంలను డిప్లాయ్ చేశామన్నారు. వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్ వరర్స్ మూడు షిఫ్టులలో రోజుకు 24 గంటలు పని చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఈనెల 2వ తేదీ వరకు వరకూ నగర వ్యాప్తంగా 1,21,905 గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగిందని.. ఈనెల 6 వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనావేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆ దిశగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం సజావుగా జరిగేలా చూస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.
బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్
కట్ట మైసమ్మ దేవాలయం, కేశవగిరి చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్, మహబూబ్‌నగర్ ఎక్స్‌రోడ్, ఇంజన్ బౌలి, అలియాబాద్, నాగుల్చింత, జేఎన్ హిమ్మత్ పురా, చార్మినార్, మదీనా ఎక్స్‌రోడ్, అఫ్జల్‌గంజ్, ఎంజే మారెట్, అబిడ్స్ జీపీవో, బీజేఆర్ విగ్రహం బషీర్‌బాగ్ క్రాస్‌రోడ్, లిబర్టీ అంబేదర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) వరకు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర సాగనుంది.
ఖైరతాబాద్ బడా గణేష్ రూట్ మ్యాప్
ఖైరతాబాద్ బడాగణేష్ పాత పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి అంబేదర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) వరకు శోభాయాత్ర కొనసాగనుంది.
బాలాపూర్ గణేశుడి దర్శించుకున్న కమిషనర్లు
బాలాపూర్ విఘ్నేశ్వరుడిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, అదనపు సీపీ విక్రమ్ సింగ్మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ నిరంజన్ రెడ్డి, కమిటీ సభ్యులు.. కమిషనర్లు, కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.