మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 24: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో పోలీస్ ట్రైనీ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు, నివారణ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబందనలు పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు డ్రైవింగ్ లైసెన్ తీసుకోవాలని కోరారు. లైసెన్లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానాతో పాటు మూడు నెలల జైలు తప్పదని తెలిపారు. ఈ సంవత్సరం డ్రైవింగ్ లైసెన్ లేని 1530 మందికి బేగంపేటలోని టీటీఐలో కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు.
యువత ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, రాంగ్ సైడ్ డ్రైవింగ్తో ఎక్కువ ప్రమాదాలు జరిగాయని అన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని, బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్లో ఉన్న మనమందరం ముందుగా ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర బాబు, చీఫ్ లా ఇస్పెక్టర్లు, అసిస్టెంట్ లా ఇస్పెక్టర్లు, రిజర్వ్ ఇస్పెక్టర్లు, సిబ్బంది, పోలీస్ ట్రైనీ విద్యార్థులు పాల్గొన్నారు.