సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కమిషనర్, సీపీలు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా రాజకీయ పార్టీల తరపున కృషి చేయాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కమిషనర్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు ఇస్తామని, అయితే కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, మాన్యువల్‌గా అనుమతులు ఇవ్వమని అన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదని అన్నారు. మతం, కులం, ప్రాంతీయ అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో, ప్రచారం నిర్వహించరాదని కమిషనర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిషరించేందుకు జిల్లాలో ఎంసీసీ, సర్వేలెన్స్ ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్స్ బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా, సి-విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని టోల్ ఫ్రీ నంబర్ 1800-599-2999కు సూచించారు. 24 గంటల పాటు పని చేస్తాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఫారం 7, 8 క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ మార్చి 23 వరకు తీసుకుంటామని ఫారం 6 మాత్రం చివరి నామినేషన్ 10 రోజుల ముందు వరకు తీసుకుంటామని పేర్కొన్నారు.
కుల, మతాల ప్రాతిపదికన ఓట్లు అడగరాదని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడ రాదని, వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఓటర్లను తప్పు దోవ పట్టించే విధంగా సమాచారం ఇవ్వడం, వ్యవహరించడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడటం, గురుద్వారా, మసీదులు, చర్చిలు, దేవాలయాలు ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, తదితరాలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనగా పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు పొలిటికల్ పార్టీల బూత్‌లు ఉండరాదని చెప్పారు. లైసెన్స్ వెపన్స్ ఉంటే డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఈవీడీఎం ప్రకాశ్ రెడ్డి, ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతయారు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కె.కృష్ణదాస్, ఎన్.విజయ్ కుమార్, ఎంఐఎం నుంచి కార్వాన్ శాసన సభ్యులు కౌసర్ మోయినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు జి.నిరంజన్, పి.రాజేశ్ కుమార్, వాజిద్ హుస్సేన్, బీజేపీ ప్రతినిధులు కొల్లూరి పవన్ కుమార్, వి.ఎస్.భరద్వాజ్, సీపీఎం పార్టీ ప్రతినిధి శ్రీనివాస్, బీఎస్పీ ప్రతినిధి కె.నందీశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.