సంగారెడ్డి, మే 24(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటనపై ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లాలో తనతొలి అధికారిక పర్యటన సందర్భంగా సీఎం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో తన ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నించారు తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ మైలేజ్ పెరిగేలా వ్యవహరించలేదని సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు.
సీఎం తన పర్యటనలో జిల్లాకు, జహీరాబాద్‌కు ఎలాంటి వరాలు కురిపించక పోవడంపై ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను స్యస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపైనా సీఎం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. జిల్లా, జహీరాబాద్ అభివృద్ధ్దికి నిధులు ఇవ్వాలని మంత్రి దామోదర నర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు కోరినా సీఎం పట్టించుకోలేదు. జహీరాబాద్ పర్యటనలో పైసా విదిల్చలేదు. దీంతో మంత్రి దామోదర సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సీఎం తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. సీఎం వరాలు ఇవ్వకపోగా, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను ఎగదోసేలా వ్యవహరించారని మంత్రి దామోదర, ఎంపీ షెట్కార్ తదితరులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
సీఎం పర్యటనతో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం
సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోసింది. సీఎం జహీరాబాద్ నియోజవర్గ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి నిమ్జ్ భూనిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు అప్పగించే బాధ్యత కట్టబెట్టారు.దీంతో సీఎం నిర్ణయంపై జహీరాబాద్ నియోజకవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. సీఎం జహీరాబాద్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించకుండా జగ్గారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్, గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి తదితరులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
సీఎంకు జహీరాబాద్ కాంగ్రెస్ నాయకులపై నమ్మకం లేదా? మమ్మల్ని అవమానిపరుస్తూ జగ్గారెడ్డి ఎలా బాధ్యతలు అప్పగిస్తారని, ఏ హోదాలో ఆయన నిమ్జ్ భూనిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారంటూ జహీరాబాద్ కాంగ్రెస్ ముఖ్యనేతలు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంతో ప్రజలు, పార్టీలో పలుచన అయ్యామని కాంగ్రెస్ నేతలు అసహనంతో ఉన్నట్లు సమాచారం.
సీఎం సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, గ్రూపురాజకీయాలు పెరిగేలా వ్యవహరించారని జహీరాబాద్ ప్రాంత నేతలు లోలోపన ఆగ్రహంగా ఊగిపోతున్నట్లు తెలిసింది. తమలోనే ఒకరికి నిమ్జ్ భూనిర్వాసితుల బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి లాభం జరుగుతుందని, లేదంటే జహీరాబాద్‌లో పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే తమ ఆవేదన, ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు. ఇదే విషయమై చర్చించేందుకు జహీరాబాద్ ప్రాంత నేతలు మంత్రి దామోదరను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
అస్తంతృప్తిలో కాంగ్రెస్ శ్రేణులు
సీఎం పర్యటనతో ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి మధ్య అంతర్గతంగా పోరు సాగుతున్నది. ఇద్దరు ఎవరికి వారే తమ వర్గానికి చెందిన నాయకుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. నియోజకవర్గంలో రాజకీయంగా పట్టుబిగించేందుకు ఇద్దరు పోటీపడుతుండటంతో ఇద్దరి మద్య రాజకీయవైరం మొదలైంది.
తాజాగా సీఎం పర్యటన సందర్భంగా ఎంపీ సురేశ్ షెట్కార్ అంతా తానై వ్యవహరించగా, ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ప్రాధాన్యత దక్కలేదు. బహిరంగ సభలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వలేదు. సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా సీఎం సానుకూలంగా స్పందించలేదు. తాను ప్రసంగించకుండా ఎంపీ సురేశ్ షెట్కార్ అడ్డుకున్నారని ఎమ్మెల్యే సంజీవరెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
సీఎం పర్యటనతో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మధ్య దూరం మరింత పెరిగిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, రైతుల అరెస్టులు జరగడం తమకు నష్టమేనని, ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్‌కు ఇది మేలు చేయదని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. మొత్తానికి సీఎం రేవంత్ పర్యటనతో ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ శ్రేణులు అస్తంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు పైసా విదిల్చని సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం జహీరాబాద్ పర్యటనలో ఎలాంటి వరాలు కురిపించలేదు. జిల్లాకు, జహీరాబాద్‌కు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. దీంతో సీఎం తీరుపై అటు ప్రజలు.. ఇటు కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు జహీరాబాద్ పట్టణం, గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరినా సీఎం స్పం దించలేదు. సొంత పార్టీకి చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నిధులు ఇవ్వాలని కోరినా సీఎం వారిని లైట్ తీసుకున్నారు.
ఎలాంటి నిధులు ప్రకటించలేదు. దీంతో సీఎం తీరుపై ఆ ముగ్గురు నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి జిల్లాలోని రెండు ప్రధాన రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, సింగూరు ప్రాజెక్టును టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఇవ్వాలని కోరారు. కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇవ్వాలని కోరారు. మంత్రి దామోదర కోరిన వాటిలో ఏ ఒక్క దానికి సీఎం నిధులు మంజూరు చేయలేదు. మంత్రి కోరిన వాటిపై సమీక్ష జరిపి నిధులు ఇస్తామని సీఎం దాటవేశారు.
ఎంపీ సురేశ్ షెట్కార్ జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు నిధులు కోరినా సీఎం రేవంత్‌రెడ్డి పైసా నిధులు ప్రకటించలేదు. జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధ్దికి రూ.50 కోట్లు ఇవ్వాలని సురేశ్ షెట్కార్ కోరారు. సీఎం ప్రారంభించిన జహీరాబాద్‌లోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరు పెట్టాలని సురేశ్‌షెట్కార్ కోరినప్పటికీ సీఎం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎం సంగారెడ్డి జిల్లాకు, జహీరాబాద్ నియోజకవర్గానికి ఎలాంటి వరాలు ప్రకటించక పోవడంతో ప్రజలతో పాటు మంత్రి దామోదర, ఇతర ముఖ్యనేతలు గుర్రుగా ఉన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా సీఎం స్పందించలేదు.