బంజారాహిల్స్, జనవరి 9: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఏదైనా ఆపద సంభవిస్తే కార్మికశాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందుతుందని, దీనికోసం ప్రతి ఒక్కరూ కార్మిక గుర్తింపు కార్డును పొందాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్ బస్తీకి చెందిన గుంటి నాగరాజు ఇటీవల ప్రమాదవశాత్తూ మృతి చెందగా కార్మికశాఖ నుంచి రూ.6.30లక్షలు నష్ట పరిహారంగా అందాయి. దీనికి సంబంధించిన చెక్కును ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేతులమీదుగా సోమవారం బాధితుడి సతీమణి గుంటి జ్యోతికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి కార్మకుడూ గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కార్మిక గుర్తింపు కార్డును తీసుకోవాలని, ఈ కార్డును కలిగి ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మామిడి నర్సింగరావు, నగేశ్సాగర్, అబ్దుల్ ఘనీ. సుధాకర్‌రెడ్డి. ఓర్సుశ్రీను, సంపంగి కిరణ్, అశోక్, చెన్నయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.