అంబర్‌పేట:‘గతంలో ఇంతకంటే ఎక్కువ వానలు కురిశాయి. మూసీకి భారీ వరదలు వచ్చాయి. పైన గండిపేట, హిమాయత్‌సాగర్ గేట్లు కూడా ఎత్తి కిందకు నీళ్లు వదిలారు. అయినా మా బస్తీలు ముంపునకు గురి కాలేదు. 30 ఏండ్ల కింద ఒకసారి ఇండ్ల అంచుకు వచ్చి వెళ్లాయి. కానీ ఇప్పుడు భయంకరంగా ఏకంగా ఇండ్లలోకే వరద నీళ్లు వచ్చాయి. గండిపేట, హిమాయత్‌సాగర్‌కు అంత పెద్ద వరద లేకపోయినా గేట్లను ఎత్తారు.
ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తుందనే అనుమానం కలుగుతున్నది’ అని అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని ముంపునకు గురైన న్యూఅంబేద్కర్గర్, కృష్ణానగర్ ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీని ప్రక్షాళన చేస్తానని చెప్పినప్పటి నుంచి ఏదో విధంగా పరీవాహక ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకే అకస్మాత్తుగా గేట్లను ఎత్తారని వారు ఆరోపించారు. ఒకేరోజు 22 గేట్లను ఎత్తడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
సాయంత్రం పూట ఒకవైపు ఉస్మాన్‌సాగర్(గండిపేట), మరోవైపు హిమాయత్‌సాగర్ రెండు జలాశయాల గేట్లు ఎత్తి బస్తీల్లోకి వరదనీరు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ఇక్కడ నుంచి ఖాళీ చేయించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు.
ఇట్లా ఎన్నడూ నీళ్లు రాలేదు
బస్తీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా. నాకు గుర్తుండి 30 ఏండ్ల కింద ఒకసారి ఇట్లాగే మూసీలో నీళ్లు వదిలితే వరద వచ్చింది. కానీ ఇండ్లలోకి రాలేదు. అంచును తగులుకుంటూ వెళ్లింది. ఇప్పుడు ఇండ్లలోకి రావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డాం. చిన్నపిల్లలు, వృద్ధులను బయటకు తీసుకురాలేకపోయాం. మూసీని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. అందుకోసమే ఒకేసారి రెండింటి నుంచి నీళ్లను వదిలారు. భయపెట్టాలనే ఆలోచనతో ఇలా చేశారు.
– మల్లేశం, అంబేద్కర్‌నగర్
కుట్ర చేస్తున్నారేమో
నేను బస్తీలో ఉండవట్టి చాలా ఏండ్లు అవుతున్నది. నేను చూసినప్పటి నుంచి వరద ఎప్పుడు రాలేదు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక మూసీ పక్కన ఉన్న బస్తీలను తొలగించి అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ముందు బస్తీల ఉంచి ప్రజలకు ఎలా ఖాళీ చేయించాలన్న కుట్రతో ఒకేసారి రెండు జలాశయాల నుంచి నీళ్లను వదిలి భయపెట్టాలని చూస్తున్నారు. ముందు నీళ్లను వదిలి భయపెట్టించి.. తర్వాత ఖాళీ చేయించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుంది. ఇది మంచి పద్ధతి కాదు.
-పాషా,అంబేద్కర్‌నగర్
కృష్ణానగర్‌లో ఇండ్లలోకి ఎప్పుడు నీళ్లు రాలేదు
కాచిగూడ కృష్ణానగర్‌లో ఇంత వరకు ఇలా ఇండ్లలోకి నీళ్లు రాలేదు. గతంలో కూడా మూసీ నదిలోకి వరద నీటిని వదిలారు. కానీ ఇండ్లలోకి అసలే రాలేదు. ఇప్పుడు రెండు జలాశయాల నుంచి నీటిని ఒక్కసారి వదిలారు. మూసీ పక్కన ఉన్న బస్తీల ప్రజలను భయపెట్టేందుకు ఇలా చేశారు. నీళ్లు తగ్గిన తర్వాత ఇక్కడ నుంచి ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం పూనుకుంటుందనే అనుమానం కలుగుతున్నది.
-బాల్‌రాజు, కృష్ణానగర్