మారేడ్‌పల్లి, జూలై 21: నగరంలోని అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. సోమవారం కంటోన్మెంట్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ పై దాడి జరిగితే ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని, కనీసం ఘటనకు పాల్పడిన వారు ఎవరు అని పోలీసులు ఇప్పటి వరకు వివరాలను ఎందుకు చెప్పలేదన్నారు.
ఎమ్మెల్యే శ్రీ గణేశ్ తనకు మరింత భద్రత పెంచుకోవడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడారా..అనేది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేశ్ 50 మంది దుండగులు దాడి చేశారు అని ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం ఆరు ద్విచక్రవాహనాల పై ఐదుగురిని అరెస్టు చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత పార్టీ నాయకుడు, ఓ వ్యక్తి తో ప్రాణ భయం ఉందని నార్త్ జోన్ డీసీపీకి రెండు రోజుల ముందే ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వారి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
ఓ రౌడీషీటర్ కు మంత్రి అండదండలుఉన్నాయని చెబుతున్న ఎమ్మెల్యే ఆ మంత్రి ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ.. ఏ టుజెడ్ తో బ్యానర్లను వేస్తే వెంటనే స్పందించిన పోలీసులు బ్యానర్‌ను తొలగించి వేసిన వారితో పాటు, బ్యానర్ ప్రింటింగ్ చేసిన వారిని కూడా అరెస్టు చేశారని, ఒక దళిత ఎమ్మెల్యే పై దాడి జరిగితే పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంతో పాటు, కనీసం వివరాలను ప్రజలకు వివరించడంలో రహస్యం ఏమిటో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే డ్రామాలు ఆడుతున్నాడా లేక పోలీసులు చెప్పింది తప్పా అని ప్రజలకు అసలు విషయం తెలియాల్సి ఉందని ఆయన డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయిన ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందన్నారు.