సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. నాగోల్ ఫతుల్లాగూడలోని ట్రైనింగ్ సెంటర్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరదలతో ముంపు, ప్రాణాపాయ పరిస్థితులు, ఆస్తినష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి..? అన్న విషయాలపై ఒక్క రోజు శిక్షణ ఇచ్చినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వచ్చే సోమవారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని, ఆసక్తి గల అపార్ట్మెంట్, బస్తీ వాసులు, ఎన్జీవో, ట్రేడ్ యూనియన్ సభ్యులు ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.