Sainik School | ఖైరతాబాద్, జూన్ 10: దేశ సుభిక్షం కోసం భావిభారత సైనికులను అందించేందుకు రాష్ట్రంలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ విద్యార్థులు ప్రస్తుత ఏపీలోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లలో విద్యార్థులు ప్రైవేట్‌గా అడ్మిషన్లు పొంది చదువును పూర్తి చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులను ఇటీవల నాన్‌లోకల్‌గా పేర్కొంటూ సైనిక్ సకూల్ సర్క్యూలర్ జారీ చేయడంతో ఇక్కడి విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని డాక్టర్ కృష్ణా రెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రంలోనూ సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లయితే వారి కష్టాలు తీరి కలలు సాకరమవుతాయని పేర్కొన్నారు. గతంలోనూ అప్పటి బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం సైనిక్ స్కూల్ ప్రస్తావన తీసుకువచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సైనిక పాఠశాల పేరెంట్స్ అసోసియేసన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాము సాగర్, ఐలయ్య, పోచయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.