మూసాపేట, డిసెంబర్ 20: లైంగికదాడితో ప్రాణాలు కోల్పోయిన గురైన దళిత యువతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో తక్షణ సాయం అందకుంటే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా వేములలో మృతురాలి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఎర్రోళ్ల పరామర్శించారు. ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘మా దళిత మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క.. నాడు మరియమ్మ కోసం గొంతెత్తి.. నేడు వేముల గ్రామంలో దళిత యువతిపై లైంగికదాడి జరిగినా ఎందుకు స్పందించడం లేదు?’ ఇప్పటికే జిల్లాలో ఐదుగురు దళితులపై లైంగికదాడులు జరిగినా పట్టించుకోవడం లేదు. పోలీసులు, ఈగల్ అధికారులు ఏం చేస్తున్నారు?’ అని నిలదీశారు. వారం క్రితం కోదాడ పీఎస్‌లో రాజేశ్ అనే వ్యక్తిని చిత్ర హింసలు పెట్టి లాకప్‌డెత్ చేశారని గుర్తుచేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపైనే 1000 హత్యలు జరిగాయని తెలిపారు. వేముల ఘటనపై డీజీపీ శ్రద్ధ తీసుకొని రిపోర్ట్ తెప్పించుకొని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.