అమీర్‌పేట్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు సాంకేతికతను వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం ముఖ్య కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భూ పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత’ అనే అంశంపై బుధవారం సనత్‌నగర్‌లోని టీజీపీసీబీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాణీప్రసాద్ మాట్లాడుతూ హాజరై ప్రసంగించారు. అటవీ సంరక్షణ, భూవినియోగ మార్పులు, నీటి వనరుల పర్యవేక్షణకు జీఐఎస్ సాంకేతికతను వినియోగించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను రాబట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. వ్యర్థాలను పునర్వినియోగించే రీసైక్లింగ్ కేంద్రాలను, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సౌరశక్తి వినియోగాన్ని, వృక్ష సంపదను పెంచుకునే దిశగా రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళిలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు తమ వంతు తోడ్పాటునందిస్తున్న పలు సంస్థలకు టీజీపీసీబీ బుధవారం గ్రీన్ చాంపియన్ అవార్డులను అందజేసింది. కాలుష్య నియంత్రణ విభాగంలో గ్లాండ్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, రాఘవ లైఫ్ సైన్సెస్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి, మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్ ఆసుపత్రి, మిర్యాలగూడలోని లీలా హెల్త్‌కేర్ ఆసుపత్రి, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా కరీంనగర్‌లోని తిమ్మాపూర్, వరంగల్ జిల్లాలోని మరియాపురం, భద్రాద్రి జిల్లాలోని తురుబాక గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల్లో వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రతిభ చూపిన నారాయణ్ పేట్, పీర్జాదిగూడ, మణికొండ, వేస్ట్ మేనేజ్మెంట్లో స్వయం సహాయ బృందాల చొరవకు జగతి మహిళా పొదుపు సంఘం (సిరిసిల్ల), రోజా మహిళా సంఘం (కోరుట్ల)తో పాటు వేస్ట్ మేనేజ్మెంట్లో స్వయం సహాయ బృందాల ఫెడరేషన్లు శాంతి ఏరియా లెవెల్ ఫెడరేషన్ (హన్మకొండ), అరాఫత్ స్లమ్ లెవెల్ ఫెడరేషన్ (నిజామాబాద్)లతో పాటు పర్యావరణ నియంత్రణలో ఎన్జీవోలు, కళాశాలలు, పాఠశాలలు, తదితరులు అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ సభ్య కార్యదర్శి బుద్ధప్రకాశ్ జ్యోతి, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ట్రేడ్ చైర్మన్ ఎం.జయదేవ్, జేఎన్టీయూ ప్రొ.టి.విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.