పటాన్ చెరు, జూలై 3: పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు పెను విషాదం నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు53 మంది మరణించారు. మరో 34 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం నిపుణుల కమిటీ సిగాచి పరిశ్రమను సందర్శించనుంది.
ఈ సందర్భంగా కార్మికుల భద్రత కోసం సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటిస్తుందా? లేదా అనే అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నట్లు సమాచారం.