ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 2: ఇంగ్లిష్ భాషను అందరు కష్టపడి నేర్చుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. విద్యార్థులు ప్రపంచ యవనికపై రాణించాలంటే భాషా నైపుణ్యం అత్యంత కీలకమని చెప్పారు. విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించడం ద్వారా అయా రంగాల్లో రాణించేందుకు సులువవుతుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ (ఈఎల్టీసీ) ద్వారా గిరిజన విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఆదివారం ముగిసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 66 మంది యూజీ చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఈ కార్యక్రమంలో భాగంగా స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ అందించారు. విద్యార్థులకు ఓయూలో నెలరోజుల పాటు వసతి కల్పించి, శిక్షణ అందించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని ఈ క్లాస్ రూంలో నిర్వహించిన కార్యక్రమ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలరాం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యాభివృద్ధికి, లైబ్రరీల ఏర్పాటుకు సింగరేణి తరపున ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలకు కూడా విద్యాభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తామన్నారు. అన్ని సమస్యలకు విద్య మాత్రమే పరిష్కారం చూపుతుందని అన్నారు. సాధికారత సాధించేందుకు సుస్థిర విద్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఈఎల్టీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ, కార్యక్రమ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ సవిన్ సౌడ, ప్రొఫెసర్ క్రిస్టోఫర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ పరిమళ కులకర్ణి, డాక్టర్ మాధవి, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.