మాదాపూర్, మే 3: నిర్మాణ రంగంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని న్యాక్‌లో ఆరు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు శనివారం సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నిర్మాణరంగంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని అన్నారు. మనల్ని గుర్తించుకోకపోయినా మనం చేసిన పనిని చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేయాలని చెప్పారు. దేశ భవిష్యత్తు ఇంజనీర్ల చేతిలోనే ఉందని, ఇంజనీర్లు చేసే పని, నాణ్యతను బట్టి వృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. యువ ఇంజనీర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి పూర్తిచేయాలని పేర్కొన్నారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు వంటివి నిర్మించిన ఇంజనీర్లకు ఇలాంటి అద్భుతమైన భవనం ఎవరు కట్టారు అనేలా ఉండాలని చెప్పారు. అనంతరం నిర్మాణ రంగంలో ఆరు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.