గ్రేటర్‌వ్యాప్తంగా శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. నగరం బతుకమ్మలతో పూలవనంగా మారింది. తంగేడు, బంతి, గునుగు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను.. పసుపు, కుంకుమతో చేసిన గౌరమ్మలను ముంగిళ్లలో ఉంచి రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ.. ఆడపడుచులు ఉత్సాహంగా ఆడి పాడారు. వాడలన్నీ ఉయ్యాల పాటలతో మార్మోగాయి. కూకట్పల్లి, రాంనగర్లో జరిగిన బతుకమ్మ వేడుకలను పై చిత్రాల్లో చూడొచ్చు.
నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా కలిసి చప్పట్లతో హోరెత్తించారు. బతుకమ్మ పాటలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బతుకమ్మ ఆడుతూ స్వాగతం పలికారు. శనివారం నగరంలోని ఆలయాలు, గ్రౌండ్లు, కాలనీల్లో బతుకమ్మ ఆడుకోవడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేయడంతో అందరూ అక్కడకు చేరుకొని బతుకమ్మ ఆడారు. ముషీరాబాద్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఆలయాలన్నీ బతుకమ్మలతో సందడిని తలపించాయి.
– సిటీబ్యూరో, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ)
వరల్డ్ కప్‌లో దాయాది పాకిస్తాన్ పై భారతదేశం ఘన విజయం సాధించడంతో.. కూకట్పల్లి రెయిన్బో విస్తా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు జాతీయ జెండాను పట్టుకుని సంబురాలు
చేసుకున్నారు.
– కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 14
హైదర్‌గూడలోని నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్వార్టర్స్‌లో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్ల సతీమణులు అంతా కలిసి బతుకమ్మ ఆడారు. ఇందులో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కూడా పాల్గొన్నారు.
– అంబర్‌పేట, అక్టోబర్ 14