సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆక్రమణలు కంటిలో నలుసులా మారాయి. దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీ పరివాహక ప్రాంతాలకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు, అనధికారిక భవనాలు, అనుమతుల్లేని పరిశ్రమలు వెలిశాయి. గత ప్రభుత్వానికి ధీటుగా మూసీ పరివాహక ప్రాంతాన్ని సరికొత్త నగరంగా తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూసీ వెంట సుమారు 12వేల అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు… ప్రత్యేక నివేదిక రూపొందించారు. డీపీఆర్‌కు అనుగుణంగా గండిపేట్ నుంచి గౌరవెల్లి వరకు అన్ని విభాగాల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడూ వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తుండగా, మూసీ వెంట ఉన్న మండలాల్లో 12వేల ఆక్రమణలు ఉన్నాయని ప్రాథమికంగా తేల్చారు. మూసీ సుందరీకరణ పేరిట ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నా… అమలుకు ఈ ఆక్రమణలు అన్నీ కూడా ఆటంకంగా మారే ప్రమాదం ఉంది.
ఇప్పటికే అధికారుల బృందం చేసిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూసీకి ఇరువైపుల ఉన్న పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలు, ఓపెన్ ల్యాండ్, బఫర్ జోన్ పరిధిలో ఉండే ఆక్రమణలను తేల్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఎంఆర్డీసీఎల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారుల బృందం మూసీ వెంబడి పర్యటించి ఆక్రమణలు, నిర్మాణాలను గుర్తించింది. గడిచిన మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు. ఇప్పటిరకు గుర్తించిన నిర్మాణాలు, ఆక్రమణలను ఏ విధంగా తొలగిస్తారు? వారందరికీ ఎలా పరిహారం అందిస్తారన్న అంశం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారేలా ఉంది. అయితే ఇప్పటివరకు సర్వేలో స్థానికుల వివరాలను కూడా నమోదు చేస్తుండగా, నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేస్తుందనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సర్వే చేస్తున్న అధికారులు కూడా తమకు ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేదంటున్నారు.
మూసీ వెంట ఇప్పటివరకు జరిగిన సర్వేలో శ్మశాన వాటికలతోపాటు, కమర్షియల్ భవనాలు, బఫర్ జోన్లో నివాసిత ప్రాంతాలు ఉన్నాయని తేల్చారు. పట్టా భూములు, వక్ఫ్, ఇనాం, ప్రైవేటు, ప్రభుత్వ భూములతోపాటు, దేవాదాయ, ఇతర భూముల వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతోపాటు, అయితే ఉన్న నిర్మాణాల్లోనూ పక్కా గృహాలా? ఎన్ని అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు. ఎంత మంది నివాసం ఉంటున్నారనే విషయాలను కూడా సర్వేలో పొందుపరిచారు. దీంతోపాటు బిల్డింగ్ ఎప్పుడూ నిర్మించారు? ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉందనే అంశంతోపాటు, ఆయా భవనాల్లో నివాసం ఉండే వారి జీవన, ఆర్థిక స్థితిగతులను కూడా సర్వేలో పొందుపరిచినట్లుగా తెలిసింది.