బంజారాహిల్స్, జూన్ 25: నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బోగస్ పత్రాలతో స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించేవారు కొందరైతే.. తాత్కాలికంగా అవసరం కోసం వాడుకుంటామని తిష్టవేసి ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకునేవారు మరికొందరు ఉన్నారు. తాజాగా షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.2లో సుమారు 2వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుని తమ సొంతానికి వాడుకుంటున్నారు. నిర్మాణ సామగ్రితో పాటు లేబర్‌కు చెందిన గుడెసెలు వేసుకుని దర్జాగా ఒలకబోస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403లోకి వచ్చే సుమారు 4ఎకరాల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉన్నది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్కువైపుకు వెళ్లే రోడ్డులో షాంగ్రిల్లా ప్లాజా పక్కనున్న ఈ స్థలంలో సుమారు 300 గజాల స్థలాన్ని నంబర్‌వన్ శ్రీధర్‌రావు అనే వ్యక్తి ఆక్రమించుకుని తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో మూడు నెలల కిందట రెవెన్యూ సిబ్బంది కూల్చేసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదే స్థలానికి పక్కనున్న సుమారు 2వేల గజాల ప్రభుత్వ స్థలంలో ఇటీవల కొన్ని గుడిసెలు వెలిశాయి.పక్కనే జింఖానా క్లబ్‌కు చెందిన నూతన భవనాన్ని నిర్మిస్తుండగా అక్కడ పనిచేసే కూలీలతోపాటు ఇతర సిబ్బంది ఉండేందుకు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయడంతోపాటు నిర్మాణసామగ్రి మొత్తాన్ని ప్రభుత్వ స్థలంలో వేశారు.
అంతటితో ఆగకుండా పెద్దఎత్తున మట్టిని, బండరాళ్లను తీసుకువచ్చి ప్రభుత్వ స్థలాన్ని చదును చేస్తూ సొంతానికి వాడుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని గతంలోనే స్థానికులు షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా.. వారంరోజుల్లో గుడిసెలు తీసేస్తామని నిర్మాణదారులు చెప్పారు. అయితే నెలరోజులు గడిచినా ప్రభుత్వ స్థలంలోని గుడిసెలు తొలగించకపోవడంతో పాటు కబ్జాలను తొలగించకపోవడం గమనార్హం. ఈ ఖాళీ ప్రభుత్వ స్థలం విలువ మార్కెట్లో సుమారు రూ.60కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. పేదలు గుడిసెలు వేస్తే వెంటనే తొలగించే రెవెన్యూ సిబ్బంది జింఖానా క్లబ్‌కు చెందిన ఆక్రమణలను తొలగించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఆక్రమణలను తొలగిస్తాం..
బంజారాహిల్స్ రోడ్ నం.2లోని షాంగ్రిల్లా ప్లాజా పక్కనున్న ప్రభుత్వ స్థలంలో నిర్మాణ సామగ్రిని వేయడంతో పాటు మట్టిని డంప్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. లేబర్ కోసం గుడిసెలు వేశామని, వారంరోజుల్లో తీసేసి స్థలాన్ని ఖాళీ చేస్తామని అక్కడి వారు చెప్పారు. వెంటనే గుడిసెలు తొలగించడంతోపాటు ఇతర ఆక్రమణలను తొలగిస్తాం. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు వచ్చినా ఉపేక్షించేది లేదు.
– అనితారెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట