హైదరాబాద్ : జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..జూలై 4న ఎదుర్కోళ్లు, 5 వ తేదీన కల్యాణం, 6 వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారని వివరాలను వెల్లడించారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో అమ్మవారి కల్యాణం, బోనాలు, ఇతర అన్నివర్గాల పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమ్మవారి కల్యాణానికి నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచికూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్నారు. వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. భారీ పోలీసు బందోబస్తు తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతిభద్రతల ను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలో ఎక్కడ కూడా సీవరేజి లీకేజీ లు లేకుండా పర్యవేక్షించాలని వాటర్ వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు.
రహదారుల మరమ్మతులు ఉంటే ఇప్పటి నుంచే చేపట్టాలన్నారు. అమ్మవారి దర్శనం, కల్యాణం కోసం ఇచ్చే పాస్ లను డూప్లికేషన్ కు ఆస్కారం లేకుండా బార్ కోడింగ్ తో కూడిన పాస్ లను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయ పరిసరాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్ ను మంత్రి ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం RTC ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు.