మేడ్చల్, జూలై 13 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ పథకం అమలు చేసేది ఎప్పుడని అర్హులు ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ పథకం జనవరి 15న ప్రారంభమైనా.. మేడ్చల్ జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో పథకం అమలు కావడం లేదు. జిల్లాలో మేడ్చల్, కత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు మాత్రమే ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పట్లో ఇందిరమ్మ పథకం అమలు కావడం కష్టంగానే కనిపిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ పథకానికి ఆర్భాటంగా దరఖాస్తులు స్వీకరించినా.. అమల్లో మాత్రం జీహెచ్ఎంసీ నియోజకవర్గాల్లో చేతులు ఎత్తిసేందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ పథకానికి దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కావాలనే కాలయాపన చేస్తున్నట్లు దరఖాస్తుదారులు భావిస్తున్నారు.
నత్తనడక ఇండ్ల నిర్మాణం
శ్రావణమాసంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే మేడ్చల్ జిల్లాలో మాత్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నత్తతో పోటీ పడుతున్నాయి. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఇచ్చిందే తక్కువ.. దీనికితోడు ఇంటి నిర్మాణాల్లో జాప్యం జరుగుతున్న క్రమంలో శ్రావణ మాసంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరగడం కష్టంగానే కనిపిస్తున్నది. మేడ్చల్ నియోజకవర్గంలో 1400 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 18 ఇండ్లు మాత్రమే స్లాబ్‌లు పూర్తయ్యాయి. 144 ఇండ్లు బేస్మింట్కే పరిమితం కాగా 7 వందల ఇండ్లకు ముగ్గులు వేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 144 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
లబ్ధిదారుల ఎంపికలో జాప్యమే..
ఇందిరమ్మ పథకానికి దరఖాస్తులు చేసుకున్న వారీలో అర్హుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆమోదిస్తే తప్ప.. అధికారులు జాబితా సిద్ధం చేయడం లేదు. ఒక వేళ అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తే దానికి రద్దు చేయించేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చేసేది ఏమీలేక అధికారులు మిన్నకుండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌కు చెందిన వారికే ఇండ్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు అధికారులపై తెస్తున్న ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు జిల్లా ఇన్చార్జి శ్రీధర్‌బాబు అనుమతి నామా మాత్రంగానే ఉంటుందన్న ఆరోపణలు దరఖాస్తుదారుల నుంచి వినిపిస్తున్నాయి.