మేడ్చల్, జూన్7(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇంటి పథకంపై అర్హులు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెసోళ్లకే కేటాయిస్తున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వాప్తంగా ఇందిరమ్మ పథకంలో ఇప్పటి వరకు 1, 284 మంది లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేశారు.
అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రధానంగా కాంగ్రెస్ నాయకులనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని తేలిపోయింది. ఉదాహరణకు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఇందులో సుమారు 40 శాతం మంది కాంగ్రెస్ నాయకుల అనుచరులు, వారి బంధు మిత్రులకు ఇండ్లు కేటాయించడంలో అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈ విషయమై ఇందిరమ్మ పథకానికి అనర్హులను ఎంపిక చేశారని, అసలైన అర్హులు మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆ నేతల ఆదేశాలతో ఇందిరమ్మ ఇండ్లు
కాంగ్రెస్ నేతల ఆదేశాలతోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరును అధికారులు చేస్తున్న క్రమంలో అసలైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అధికారుల మాట చెల్లుబాటు కాకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి ఇప్పటి వరకు మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని, ఇంకా ఇప్పటి వరకు మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో దరఖాస్తుల పరిశీలనే ప్రారంభం కాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
అనర్హులకు కేటాయించిన ఇండ్లను రద్దు చేయాలి..
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో అనర్హులకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేయాలని అసలైన అర్హులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాన్ని కాంగ్రెస్ నాయకులు అనుచరులు, వారి బంధువుల కోసం ప్రవేశపెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కాంగ్రెస్ నాయకులు జోక్యం లేకుండా చేసి అర్హులకు ఇండ్లను కేటాయించాలని అధికారులను కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలానే జరిగితే ఇందిరమ్మ పథకం కాంగ్రెస్ నాయకులకే పరిమితమవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.