సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రూ. 2.2 వేల కోట్ల టెండర్లను పిలిచింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అటు బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు అంశంలో తమతో చర్చలు జరపకుండా, ఆస్తులు కోల్పోయి రోడ్డున్న పడుతామని వేడుకుంటున్నా కాంగ్రెస్ సర్కారు ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతున్నదని మండిపడుతున్నారు.
కాగా, ప్రభుత్వం బాధితుల నుంచి ఉద్దేశపూర్వకంగా, బలవంతంగా భూములు సేకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు భూసేకరణ నోటీసుల పేరిట రెవెన్యూ యంత్రాంగం హడావుడి చేసింది. తాజాగా హెచ్ఎండీఏ అధికారులు ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్లను ఆహ్వానించడంతో అసలు ప్రక్రియకు తెరలేపింది. ప్రాజెక్టును వ్యతిరేకించకుండా, అసంబద్ధమైన భూసేకరణ విధానాన్ని బాధితులు అడ్డుపడుతున్నారు.
కానీ ప్రభుత్వం భూసేకరణ, పరిహారం, ప్రాజెక్టు వెడల్పును పట్టించుకోకుండా.. 11.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు రూ. 2200 కోట్లతో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో నెలరోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. భూసేకరణ ప్రక్రియ కాకుండా, కోర్టు పరిధిలోనే ఈ వ్యవహారం ఉండగానే టెండర్ ప్రక్రియ చేపట్టడంపై రాజీవ్ రహదారి జేఎసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.