సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్‌ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బుధవారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా, రాయచోటికి చెందిన రేకుల కుంట ప్రసాద్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.
ఈజీ మనీ కోసం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడడంతో తిరుపతి జైలుకు పంపించారు. జైల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయిన మరో నిందితుడు లోకేశ్వర్‌రెడ్డి పరిచయమయ్యాడు. జైల్లో ఉన్న సమయంలో ఇద్దరు వివిధ విషయాలపై మాట్లాడుకొని ఏనుగు దంతాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, వాటిని అడవుల్లో సేకరించి, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తరువాత లోకేశ్వర్‌రెడ్డి శేషాచలం అడవుల్లోని యానదుల గిరిజనుల నుంచి రెండు ఏనుగు దంతాలు సేకరించాడు.
వాటిని తీసుకొని ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లో విక్రయించేందుకు వచ్చారు. ఎల్బీనగర్ ప్రాంతంలో రెండు ఏనుగు దంతాలు విక్రయించేందుకు కొనుగోలుదారుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య బృందానికి సమాచారం రావడంతో హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ప్రసాద్‌ను పట్టుకొని అతడి వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు లోకేశ్వర్‌రెడ్డి పోలీసులను చూసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 5.62 కిలోల రెండు ఏనుగు దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలో ఉంటుందని తెలిపారు.