సిటీ బ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఐదు అంతస్తుల భవనానికి అనుమతి లేకుండానే విద్యుత్ సరఫరాను ఇచ్చి నకిలీ డాక్యుమెంట్లపై ఎలాంటి విచారణ చేయలేదంటూ మేడ్చల్ పరిధిలోని ఓ ఏడీఈకి నోటీసులు ఇచ్చారు. ఒక్క మేడ్చల్‌లోనే 8 మంది అధికారులను ఇదే తరహా ఫేక్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లను పరిశీలించలేదనే కారణంగా నోటీసులు ఇచ్చి వారిపై చర్యలకు స్థానిక ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ మెమోలు ఇచ్చి నెలరోజులు గడిచినా ఇప్పటివరకు ఎవరిపై చర్యలు లేవు సరికదా.. యథాతధంగా వారి పని వారు చేసుకుంటూనే ఉన్నారు. సికింద్రాబాద్ సర్కిల్లోని రాజేశ్వర్నగర్లో జీహెచ్ఎంసీ అనుమతి ఉన్న ప్లాన్‌తో పాటు 21 మీటర్ల భవనానికి నకిలీ డాక్యుమెంట్లు పెట్టి విద్యుత్ సైప్లె తీసుకున్నారు.
ఇందులో క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా ఎలా సైప్లె ఇచ్చారని, ఇందులో జరిగిన లావాదేవీలపై లోతుగా విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం బాధ్యులుగా ఏడీఈని తేల్చింది. కానీ ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం మెమో ఇచ్చి వదిలేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే బోయన్‌పల్లి ఆపరేషన్ ఏఈ, ఏడీఈ, బోయిన్పల్లి ఐఎస్‌ఎస్‌ఈ ఏడీఈ, సైబర్‌సిటీ,రాజేంద్రనగర్ సర్కిళ్లలో బాలాజీ నగర్ సెక్షన్ లైన్మెన్, కూపీహెచ్బీ సెక్షన్ లైన్ఇన్స్పెక్టర్, గతంలో అల్లాపూర్ సెక్షన్లో పనిచేసిన ఏఈ, ప్రైవేటు మీటర్ రీడర్, ఇబ్రహీంబాగ్ లైన్మెన్, హబ్సిగూడ సర్కిల్లో ఇద్దరు ఏఈలు.. అన్ని సర్కిళ్లలో మొత్తం 56 మందికి మెమోలు ఇచ్చారు. ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత సర్కిళ్ల ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు చర్యలు లేవు. కారణం రాజకీయ ఒత్తిళ్లు, సంస్థలో అక్రమ అధికారులకు వత్తాసు పలికే వారి గాడ్ఫాదర్లే అని తెలుస్తోంది. ఇటీవల నకిలీల దందాతో అక్రమంగా కనెక్షన్లు ఇచ్చిన ఎస్పీడీసీఎల్లో కొందరు అధికారుల అవినీతి బాగోతంపై విద్యుత్ విజిలెన్స్ విచారణ చేపట్టింది.
పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సదరు ఇంజినీర్లు, సిబ్బంది అక్రమాలు చేశారని నిర్ధారిస్తూ బాధ్యులపై చర్యలకు డిస్కం ఉన్నతాధికారులకు సిఫారసు చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఉన్నతాధికారులకు సీఎండీ ముషారఫ్ ఆదేశాలు జారీ చేసినా వారిలో కదలిక లేదు. దీంతో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎండీ ఆయా సర్కిళ్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవినీతికి పాల్పడడం, అనుమతి లేకున్నా సరైన పత్రాలు లేకుండా విద్యుత్ కనెక్షన్లు, మీటర్లు ఇవ్వడం, ఎన్వోసీ లేకుండా హైరైజ్డ్ బిల్డింగులకు కరెంట్ సరఫరా చేయడం వరకు కొందరు సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ప్రతి సర్కిల్లో ఓఅండ్ఎం విభాగంపై ఫిర్యాదులు రాగా ఏఈ, డీఈ, ఏడీఈలను బాధ్యులను చేశారు. అక్టోబర్, నవంబర్లలో ఈ వ్యవహారాలకు సంబంధించి ఆయా అధికారులకు నోటీసులు జారీ చేశారు.
ముఖ్యంగా నవంబర్ 21న నమస్తే తెలంగాణలో నకిలీ ఎన్వోసీలు, ఫేక్ సర్టిఫికెట్లపై కథనం రావడంతో ఎస్పీడీసీఎల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు అంతర్గతంగా విచారణ చేస్తామని చెప్పినప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా ఇకముందు ఇలా జరగకుండా చూడాలంటూ ఉన్నతాధికారులు సర్కిళ్లలో అధికారులను నియంత్రించారు. అయితే నమస్తేలో కథనం వచ్చిన తర్వాత సరూర్‌నగర్ నుంచి మొదలైన వ్యవహారం మొత్తం డిస్కంలో నకిలీ పత్రాలపై విచారణకు మూలమైంది. ఆ తర్వాత క్రమక్రమంగా పాత ఫిర్యాదులు, కొత్తగా చేస్తున్న దందాలపై దృష్టి పెట్టిన డిస్కం విజిలెన్స్ అధికారులు వెంటవెంటనే నకిలీలను గుర్తించి వాటికి బాధ్యులపై నివేదిక అందించారు. అంతకుముందే కొందరిపై చర్యలకు సిఫారసు చేయగా మరికొంతమందికి నవంబర్ చివరివారంలో నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు కేవలం స్థానిక ఉన్నతాధికారులపై ఉన్న ఒత్తిడే కారణమని తెలుస్తోంది.
విద్యుత్ కనెక్షన్లలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎండీ ముషారఫ్ ఆయా సర్కిళ్లు, జోన్ల ఉన్నతాధికారులకు గత నెలలోనే ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇప్పటివరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏదో ఒక సాకు చూపి ఇప్పటికీ వారిపై చర్యలను వాయిదా వేస్తున్నారు. దీనిపై ఒక ప్రొసిజర్ ప్రకారం ముందుకు పోవాలని, లేకుంటే వారు కోర్టుకు వెళ్లే అవకాశముంటుందని సర్కిల్ అధికారి ఒకరు చెప్పారు. అయితే సాక్షాత్తు సీఎండీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా సాక్ష్యాలతో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా అడుగుపడడం లేదంటే ఇది సీఎండీకి ఝలకే అని డిస్కంలో అధికారుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయా సర్కిళ్లల్లో మెమోలు అందుకున్న అధికారులు తమపై ఎలాంటి చర్యలు లేకుండా రాజకీయంగా తమకున్న పలుకుబడితో పాటు తాము పనిచేస్తున్న యూనియన్లను, ఇతర అన్ని అవకాశాలను వాడుతూ జోనల్, సర్కిల్ స్థాయి ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారు.
అవసరమైతే తమపై చర్యలు తీసుకోకుండా ఎంత ఖర్చైనా పెడుతామని దగ్గరి వారితో అంటున్నట్లు సమాచారం. తమకు ఈ స్థితికి రావడానికి కారణమైన కొందరు ప్రైవేటు కాంట్రాక్టర్లతో ఈ విషయమై అక్రమాలకు పాల్పడిన అధికారులు చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసలు తాము ఎలాంటి చర్యలు తీసుకున్నా వారి ఆదేశాలు అమలు అవుతాయా లేదా అనే చర్చ కూడా ఉన్నతాధికారుల్లో జరుగుతుంది. బదిలీలు, ప్రమోషన్లు, ఇతర ఏ అంశమైనా గతంలో సీజీఎంలు, ఎస్ఈల ప్రమేయంతో జరిగేది. కానీ ఇప్పుడు డిస్కంలో పరిస్థితి మొత్తం తారుమారైంది. తమ సర్కిల్లో పనిచేసే చిన్న ఉద్యోగి మొదలు, డీఈ స్థాయి వరకు ఎవరూ తమ పై అధికారులను ఖాతరు చేయడం లేదు.
సరికదా.. సీఎండీ మాటలను కూడా లెక్కపెట్టడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా ఏకంగా తమ మంత్రిని లేదా తమకు సంబంధమున్న పెద్ద లీడర్లతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే చర్చ మింట్‌కాంపౌండ్‌లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎండీ ఇచ్చిన ఆదేశాలు సైతం అమలు చేయాలంటే ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తూ ఏదేమైనా తమ బాధ డిస్కం ఉన్నతాధికారికి చెప్పుకుందామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నకిలీలు సృష్టించి అధికారులను బెదిరించిన ఓ కాంట్రాక్టర్‌పై పిర్జాదిగూడ పీఎస్‌లో కేసు పెట్టినట్లు సమాచారం. మరికొంతమందిపై వారివారి పరిధిలో కేసులు పెట్టాలని, కొందరు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సీఎండీ ఆదేశించినా వీటి విషయంనూ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు.