Power Cuts | సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోజుకు ఐదారు సార్లు కరెంటు పోయి.. రావడంతో ఎండలు ముదిరి వినియోగం మరింత పెరిగేకొద్దీ ఈ కష్టాలు కూడా ఎక్కువైతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా పరీక్షల సమయం కావడంతో పాటు వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులు ఇంటర్నెట్ ఆధారపడుతున్నందున ఈ స్వల్ప కాల కోతలు చిరాకు పుట్టిస్తున్నాయి.
దీంతో పాటు పలుచోట్ల ముందుగానే ప్రకటించి ఒకట్రెండు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. ఇదేమంటే మెయింటెనెన్స్ అని సమాధానమిస్తున్నారు. రోజురోజుకీ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కూలర్లు, ఏసీల రూపంలో వినియోగం కూడా గణనీయంగా పెరుగుతున్నది. తద్వారా ఫీడర్లపై లోడ్ పెరగడంతోనే కరెంటు సరఫరాలో పదనిసలు చోటుచేసుకుంటున్నాయని అధికారులే అనధికారికంగా చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో రోజూ కరెంటు సరఫరాలో అంతరాయం అనేది సాధారణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కోతల ప్రభావం ఎక్కువ కనిపిస్తున్నా… నగరంలో మాత్రం కనిపించని కోతలు జనాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా నగరంలో ఎండల ప్రభావం పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతున్నా గృహాల్లో పగటి ఎండల తాలూకు వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో కూలర్లు, ఏసీల వాడకం భారీ ఎత్తున పెరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాది ఏప్రిల్ మాసంలో నమోదైన కరెంటు వినియోగం ఈసారి ఫిబ్రవరిలోనే నమోదైందని అధికారులే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫీడర్లపై లోడ్ పెరిగి తరచూ కరెంటు సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నది. ప్రతిచోటా రోజులో కనీసంగా నాలుగైదు సార్లు కరెంటు పోయి… ఐదు, పది నిమిషాలకు రావడం చోటుచేసుకుంటున్నది. చీటికి మాటికి అంతరాయలతో విసుగెత్తున్న ప్రజలు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.
ప్రస్తుతం పరీక్షల సమయం. పరీక్షలకు సిద్ధమవ్వడంలో భాగంగా చాలామంది విద్యార్థులు ఇంటర్నెట్పైపై ఆధారపడి కొంతమేర చదువు కోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఐటీ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంలో కూడా ఉన్నారు. దీంతో వీరు కూడా ఇంటర్నెట్పై ఆధారపడి పని చేయాల్సి ఉంది. అయితే రోజులో నాలుగైదు సార్లు కరెంటు పోయి రావడంతో ప్రతిసారీ ఇంట్లో ఉన్న వైఫై కనెక్ట్ అయ్యేందుకు కొంత సమయం పట్టడం వీరిని ఇబ్బందులకు గురి చేస్తున్నది.
గ్రేటర్లో ఇటీవల తరచుగా కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. అంతరాయానికి కొంతమంది అధికారులు చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా విద్యుత్ నిలిపివేస్తున్నామని చెబుతున్నారు. పలు ఫీడర్ల పరిధిలో అర్ధరాత్రి తర్వాత సరఫరా నిలిచిపోతుంటే.. మరికొన్ని ఫీడర్ల పరిధిలో తెల్లవారుజాము నుంచి కొన్నిచోట్ల.. మరికొన్నిచోట్ల మధ్యాహ్నం సరఫరా నిలిచిపోతున్నది.తమకు ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో వెంటవెంటనే పునరుద్ధరిస్తున్న అధికారులు.. బస్తీల్లో మాత్రం గంటకు పైగానే కరెంట్ పోయినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
కొండాపూర్ శిల్పాపార్క్ వద్ద శుక్రవారం కరెంట్ కోతలతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరెంట్ పోగా తిరిగి మూడు గంటలకు వచ్చింది. మళ్లీ ఒక అరగంట మధ్యలో పోయింది. తిరిగి 7 గంటలకు కరెంట్ పోయి 8గంటలకు వచ్చింది. ఇలా ఒక్కరోజులో నాలుగైదు సార్లు కరెంట్ పోవడంతో తాము తిరిగి బెంగళూరుకు వెళ్లిపోతామంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అన్నారు.