Goshamahal | అబిడ్స్, మార్చి 7 : గోషామహల్ నాలా పైకప్పు కూలిపోవడంతో ఆ ప్రాంతంలో మరమ్మత్తులు నత్తనడకన సాగుతుండగా శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ మెయిన్ లైన్ స్తంభాలు నాలాలో కూలిపోయాయి. దీంతో పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. గోషామహల్ ప్రధాన రహదారి మీదుగా ప్రవహించే నాలా పైకప్పు ఇప్పటికీ పలుమార్లు కుప్పకూలిపోయింది. తాజాగా 25 రోజుల క్రితం గోషామహల్ ప్రధాన రహదారిపై నాలా కుప్పకూలిపోయిన విషయం విదితమే. కాగా కుప్పకూలిపోయిన నాలాకు మరమ్మత్తులు చేపట్టడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏకంగా రహదారి మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోషామహల్ ప్రధాన రహదారి నాలా పైకప్పు కూలిపోవడంతో అధికారులు మరమ్మత్తు పనులను సాగిస్తుండగా అకస్మాత్తుగా రెండు విద్యుత్ స్తంభాలు నాలాలో కూలిపోయాయి. దీంతో విద్యుత్ వైర్లు తెగిపోవడం షార్ట్ సర్క్యూట్ వలన గోషామహల్, చాక్నా వాడి, చందన వాడి పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గోషామహల్ ప్రధాన రహదారి నాలా పనులను వెంటనే పూర్తిచేసి ఈ రహదారిపై వాహన వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు. 25 రోజులుగా గోషామహల్ ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయమై అధికారులకు విజ్ఞప్తి చేస్తే ఇప్పటివరకు కనీసం నాలాలో కూలిపోయిన మట్టిని కూడా ఎత్తి వేయలేదని ఇంకా ఎన్నడు ఎత్తివేసి పూర్తి చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక తీసుకొని నాలా పైకప్పు నిర్మాణ పనులను పూర్తి చేసి రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
గోషామహల్ ప్రధాన రహదారి నాలా పైకప్పు కూలడం వలన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రజలు, వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. నాలా పైకప్పు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రహదారిపై రాకపోకలను పునరుద్ధరించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ విషయంలో జిహెచ్ఎంసి కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే పనులు పూర్తిచేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించి ప్రజలు, వ్యాపారుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.