సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రారంభంలోనే గత బీఆర్ఎస్ సర్కారు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లింది. ఫలితంగా పదేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు, అంతరాయాలు అనే మాటకు చోటు లేకుండా పోయింది. రాష్ట్రంలో నివాసముంటున్న ప్రజలందరికీ, వ్యాపార కార్యకలాపాలకు ఎంత అవసరమైతే అంత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. అలాంటి వ్యవస్థ 5 నెలల్లోనే అస్తవ్యస్తంగా మారింది. అందుకు ప్రత్యేక నిదర్శనం ఈ ఏడాది వేసవి కాలంలో వచ్చిన ఈదురుగాలులకు, తాజాగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు తోడు గంటల తరబడి సరఫరాను పునరుద్ధరించలేని పరిస్థితి. గత కేసీఆర్ ప్రభుత్వం డిస్కం పరిధిలో పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చడం కోసం రూ. 14,063 కోట్లు వెచ్చిస్తే, అందులో రూ.10 వేల కోట్లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలోనే ఖర్చు చేశారు. ఈ 9 సర్కిళ్ల పరిధిలోనే 60 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచే డిస్కంకు మంచి ఆదాయం వస్తోంది. అలాంటి చోటే తరచూ విద్యుత్ అంతరాయాలతో వినియోగదారులకు ఇబ్బందులే కాదు, సంస్థకు రావాల్సిన ఆదాయంలోనూ కోత పడుతోంది.
ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభమైన మార్చి నుంచి మే నెల 14 తేదీ వరకు రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ ఏడాది వేసవిలో అత్యధిక డిమాండు 90.68 మిలియన్ యూనిట్లు ఉంది. గతేడాది(2023) ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే.. ఈ ఏడాది (2024) ఏప్రిల్‌లో ఒకేసారి 38.89 శాతం విద్యుత్ వినియోగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నది. అదే సమయంలో గరిష్ఠ డిమాండు అత్యధికంగా 4241 మెగావాట్లు నమోదవ్వగా, వృద్ధిరేటు 35.91 శాతంగా నమోదైంది.ఈ స్థాయిలో డిమాండు తట్టుకునేలా గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఇక చేయాల్సిందల్లా నిర్వహణ, మరమ్మతులు మాత్రమే. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా వ్యవస్థలో నిర్వహణ లోపించింది. నిరంతరం నాణ్యమైన సరఫరా చేసేందుకు అవసరమైన విధంగా క్షేత్ర స్థాయిలో లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల నిర్వహణ చేపట్ట లేదు. దాని ఫలితంగానే ఏమాత్రం గాలి వాన వచ్చినా.. విద్యుత్ తీగలపై చెట్లు, వాటి కొమ్మలు కూలుతుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
గాలి వానతో వర్షం కురిసిందంటే చాలు.. చెట్లు, కొమ్మలు తీగలు, స్తంభాలపై పడటం.. కరెంటు సరఫరా నిలిచిపోవడం సర్వసాధారణంగా అన్నట్లుగా మారింది. ఇటీవల మూడు సంఘటనల్లో గంటలు గడిచినా.. సరఫరా లేకపోవడంతో సబ్ స్టేషన్లను విద్యుత్ వినియోగదారులు ముట్టడించారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందస్తుగానే క్షేత్ర స్థాయిలో నెట్‌వర్క్‌ను పరిశీలించి మరమ్మతులు చేపట్టాల్సిన విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు. ఆలస్యంగా తూతూ మంత్రంగా నిర్వహణ, మరమ్మతులు చేపట్టారు. దాని ఫలితంగానే ఎక్కడ చూసినా.. చెట్లు కూలిపోవడం, కొమ్మలు తీగలపై పడిపోవడం, కొన్ని చోట్ల కేబుల్ కాలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
సిటీబ్యూరో: గ్రేటర్లో నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. గత నెల 31వ తేదీ నాటికే నిర్దేశిత గడువు పూర్తి చేసుకొని వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పనులపై నిర్లక్ష్యం చూపారు. దాదాపు 18 రోజుల పాటు కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళితే ఆ కారణంతోనే పూడికతీత పనుల్లో జాప్యం జరిగిందని చెబుతున్న అధికారులు.. రోజూ వర్షాలు పడుతున్నా.. కొన్ని చోట్ల పనుల్లో వేగం పెంచడం లేదు. శేరిలింగంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో నాలా పూడికతీత పనులు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. సంబంధిత జోన్లో క్షేత్రస్థాయిలో 70 శాతం కూడా పనులు పూర్తి చేయలేదని, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లింపులు లేకనే పనులు నత్తనడకన జరుగుతున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ జోన్‌లోని ఐదు సర్కిళ్లు మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ , బల్కాపూర్ నాలా డీసిల్టింగ్‌కు సంబంధించి పనులపై అనుమానాలు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. మొత్తంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో పూడికతీత పనులు పారదర్శకంగా జరగగా పోగా, నాలా పరీవాహక ప్రాంత ప్రజలు భారీ వర్షం వస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి నెలకొన్నదని స్థానికులు వాపోతున్నారు.