సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సాధారణంగా చలికాలంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్లో చలి ఎక్కువగానే ఉన్నా మధ్యాహ్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం మాత్రం పెరుగుతూ వస్తున్నది. వారంరోజులుగా గ్రేటర్లో రోజురోజుకూ కరెంట్ వాడకం పెరుగుతున్నదని అధికారులు చెప్పారు. శుక్రవారం నగరంలో విద్యుత్ వినియోగం 3417 మెగావాట్లుగా నమోదైంది. సాధారణంగా విద్యుత్ వినియోగం మార్చి నెల నుంచి గణనీయంగా పెరగాలి. కానీ గత సంవత్సరం ఫిబ్రవరిలోనే వినియోగం పెరగగా ఈసారి జనవరి మూడోవారం నుంచే కరెంట్ వాడకం పెరుగుతూ వస్తున్నది.
గతంతో పోలిస్తే ఈసారి మార్చ్, ఏప్రిల్‌లోనే గరిష్ట వినియోగం నమోదయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్లను పూర్తిచేయాలని, ఈనెలాఖరులోగా పూర్తిగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో విద్యుత్ వినియోగం 80 నుంచి 90 మిలియన్యూనిట్లు జరగగా.. ఈ సంవత్సరం 100 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు గరిష్ఠ డిమాండ్ ఈసారి 5వేల మెగావాట్లకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.
గత పదిరోజులలో ఒకే రోజు అంటే 18వ తేదీ నుంచి 19వ తేదీకి విద్యుత్ వినియోగం సుమారు 510 మెగావాట్లు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత నుంచి ప్రతీరోజూ వాడకం పెరిగిందని, ఇందుకు మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటున్నదని, మరోవైపు పండుగ సెలవులు పూర్తి చేసుకుని నగరవాసులంతా సిటీకి తిరిగి వచ్చేయడంతో వినియోగం పెరిగిందని చెప్పారు. అయితే రిపబ్లిక్‌డే, ఆదివారంతో పాటు మేడారం జాతర కారణంగా పలువురు నగరం నుంచి మేడారానికి వెళ్లడంతో వినియోగం కొంతమేరకు తగ్గినప్పటికీ సాధారణ వినియోగం 3100 మెగావాట్లు దాటుతున్నదని అధికారులు చెప్పారు.
2024లో గ్రేటర్ వ్యాప్తంగా వార్షిక సగటు డిమాండ్ 4352 మెగావాట్లు కాగా 2025లో వాతావరణ పరిస్థితుల వల్ల కొంత మేరకు తగ్గి 4190 మెగా వాట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగర పరిధిలో 2024లో 62.92 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 2025లో 67.98లక్షల కనెక్షన్లకు పెరిగాయి. ప్రస్తుతం ఉన్న విద్యుత్ వినియోగంతో పాటు గత సంవత్సరం వినియోగాన్ని అంచనా వేస్తూ ఈసారి సుమారుగా 4700 నుంచి 5వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఈసారి సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మూడు జోన్లలో పనులు మొదలుపెట్టారు. ఇవి దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయని ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. మెట్రోజోన్‌లో 76 డీటీఆర్లు, 36 పీటీఆర్లు, 122 కొత్త 11కేవీ ఫీడర్లు, ,37 కొత్త 33 కేవీ ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్ జోన్లో 1483 డీటీఆర్లు, 58 పీటీఆర్లు, 187 కొత్త 11కేవీ ఫీడర్లు, ,28 కొత్త 33కేవీ ఫీడర్లు ఏర్పాటు చేస్తుండగా, రంగారెడ్డి జోన్లో 1158 డీటీఆర్లు, 69 పీటీఆర్లు, 218 కొత్త 11కేవీ ఫీడర్లు,53 కొత్త 33కేవీ ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జోన్లో సైబర్‌సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్ వంటి అధిక వినియోగం కలిగిన సర్కిళ్లు ఉండడంతో పాటు మేడ్చల్ జోన్లో కూడా ఎక్కువగా పనులు చేస్తున్నామని దక్షిణ డిస్కం అధికారులు చెప్పారు.
అయితే వేసవి కాలంలో గత యాక్షన్ ప్లాన్ పనులే కేబుల్ లేక మొదలుపెట్టని డిస్కం యాజమాన్యం ఈసారి కూడా 33కేవీ, 11కేవీ కేబుల్‌తో కూడిన పనులకు అత్యవసరంగా టెండర్లు పిలిచింది. కేబుల్ విషయంలో ఒక స్పష్టత లేకపోవడంతో సైప్లె చేయకుండా పనులెలా చేయాలంటూ కాంట్రాక్టర్లు అడిగినప్పటికీ అధికారులు టెండర్లు అయిపోయిన తర్వాత చూద్దాం అంటూ చెప్పినట్లు తెలిసింది. గత సంవత్సరం లాగే ఈసారి కూడా నామమాత్రంగా టెండర్లు పిలిచి పనుల విషయంలో కేబుల్ కమిషన్ వ్యవహారం సెటిల్ అయితేనే ముందడుగు పడుతుందంటూ డిస్కంలో చర్చ జరుగుతోంది.