SPDCL | సిటీబ్యూరో: ఏదైనా పని ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి వెళ్తుంటారు. అలాంటిది నిబంధనల పేరిట ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చర్యలు చేపట్టడంపై విద్యుత్ వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రజలకు సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యాలయాలను తమ సొంత సంస్థల్లాగా ఉన్నతాధికారులు భావిస్తూ నిబంధనలు అమలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించడంపై అమలు చేస్తున్న నిబంధన పలు విమర్శలకు తావిస్తున్నది. సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత అధికారులను కేవలం 5 గంటల్లోపే కలవాలంటూ పెట్టిన ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు సాయంత్రం 4 గంటలు కాగానే ఇంటికి వెళ్లే సమయంలో అనుమతిస్తే వారు తమ సమస్యలను సరిగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దక్షిణ తెలంగాణలోని 15 జిల్లాలకు సంబంధించి విద్యుత్ సరఫరా వ్యవస్థలను పర్యవేక్షించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో ఉంది. ఇక్కడికి గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి సైతం విద్యుత్ వినియోగదారులతో పాటు కాంట్రాక్టర్లు వివిధ పనుల కోసం వచ్చి వెళ్తుంటారు. సుమారు 150 నుంచి 200 కి.మీ దూరం నుంచి వచ్చిన వారికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి లేకపొతే అధికారులను కలిసేదెప్పుడు? వచ్చిన పని పూర్తయ్యేందుకు సమయం ఎక్కడిదంటూ విద్యుత్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.