SPDCL | సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ నగరానికే పరిమితమైన టోల్ ఫ్రీ నంబర్ 1912ను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం గానీ, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి కానీ ఎదురైనప్పుడు ఈ నంబర్లో సంప్రదించాలని వినియోగదారులకు ఆయన సూచించారు.
మునుపెన్నడూ లేనంతగా ఈ జనవరి నెలలో దక్షిణ డిస్కంలో విద్యుత్ డిమాండ్ 9500 మెగావాట్లకు చేరిందని, ఒక్క గ్రేటర్లోనే 4800 మెగావాట్లకు చేరడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి కాలంలో ఈ డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టామని, సిబ్బంది కూడా వినియోగదారుల సమస్యలపై సకాలంలో స్పందించి వాటికి పరిష్కారం చూపాలని ముషారఫ్ ఫరూఖి తెలిపారు.