జవహర్‌నగర్, జనవరి 10: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో.. ఓ నిండుప్రాణం బలైంది. విద్యుత్ అధికారులు ఎల్సీ తీసుకుని.. కార్మికుడితో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగానే మళ్లీ తిరిగి విద్యుత్ సరఫరా కావడంతో 11కేవీ వైర్లు తగిలి ఓ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి సంతోష్‌నగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది.
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం… ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, గోవింద్రాల బంజార్ తండా గ్రామానికి చెందిన బానోత్ ప్రశాంత్(26) జవహర్‌నగర్ కార్పొరేషన్ సంతోష్‌నగర్‌కు వలస వచ్చి విద్యుత్ సంస్థలో ప్రైవేటు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రశాంత్ భార్య సరిత(9 నెలల గర్భిణీ)తో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
శుక్రవారం ఉదయం సంతోష్‌నగర్‌లో విద్యుత్ వైర్లు మార్చుతుండగా.. ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికంగా ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ మేరకు విద్యుత్ ఏఈ, లైన్‌మన్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే మా భర్త మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్తంభంపై ప్రశాంత్ విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా.. ఏఈ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. ఎల్సీ తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించడంతోనే ప్రశాంత్ స్తంభంపై నుంచి కిందపడిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతోనే నా కుమారుడిని పొట్టనపెట్టుకున్నారని తల్లిదండ్రులు రోదించారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. భార్య సరితతో శుక్రవారం ఉదయం ఫోన్ చేసిన ప్రశాంత్.. కొన్ని గంటల వ్యవధిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద రోదించారు.