మెట్రోస్టేషన్ల వద్ద 5 నిమిషాల్లో రెడీ
మొదటి కిలోమీటర్‌కు రూ.10, తర్వాత రూ.6
స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో సేవలు
తొలుత రెండు స్టేషన్ల వద్ద ప్రారంభం
సులభతర ప్రయాణానికి కేరాఫ్ అయిన మెట్రో సేవల్లో మరో ముందడుగు. రైలు దిగిన 5 నిమిషాల్లో గమ్యం చేరేందుకు మెట్రోరైడ్ సంస్థ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను అందుబాటులో ఉంచింది. గురువారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్ వద్ద ఈ-ఆటోలను మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఈవో కేవీబీ రెడ్డి ప్రారంభించారు. మొదటి కిలోమీటర్‌కు రూ.10, తర్వాత నుంచి రూ.6 చొప్పున వసూలు చేస్తారు. తొలిదశలో పరేడ్‌గ్రౌండ్, రాయదుర్గం మెట్రోస్టేషన్ల వద్ద 15 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టామని, దశలవారీగా అన్నిస్టేషన్ల వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నుంచి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను నడుపుతున్నట్లు తెలిపారు. గురువారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో బెంగళూరుకు చెందిన మెట్రో రైడ్ సంస్థతో పాటు షెల్ ఫౌండేషన్, డబ్ల్యుఆర్ఐ ఇండియాలతో కలిసి ఆయన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ధరలను నిర్ణయించామని తెలిపారు. మొదటి కిలో మీటర్‌కు రూ.10, తర్వాత కి.మీకు రూ.6 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మెట్రో రైలు దిగిన తర్వాత 5 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణికుడిని రిసీవ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
6 లక్షల మంది ప్రయాణించే అవకాశం
కరోనాకు ముందు మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.50 లక్షల మంది ఉండగా.. ప్రస్తుతం 2.75లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఐటీ కంపెనీలు సైతం తెరుచుకోవడంతో ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎండీ చెప్పారు. మెట్రోలో 6 లక్షల మంది ప్రయాణించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్అండ్టీ మెట్రో ఎండీ, సీఈఓ కేవీబీ.రెడ్డి, మెట్రోరైడ్ సంస్థ వ్యవస్థాపకులు గిరీష్నాగ్పాల్, డబ్ల్యుఆర్ఐ ఇండియా డైరెక్టర్ పవన్ ములుకుట్ల, షెల్ ఫౌండేషన్ ప్రతినిధి తషీన్ అలం, తదితరులు పాల్గొన్నారు.
మొదటి దశలో రెండు స్టేషన్ల నుంచి
మెట్రో కారిడార్‌లోని పరేడ్‌గ్రౌండ్, ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద 15 ఆటోల చొప్పున అందుబాటులో ఉంటాయి. మెట్రో రైడ్ సంస్థ నడుపుతున్న ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఎంతో సురక్షితమైనవి. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడం ద్వారా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
-కేవీబీ రెడ్డి, సీఈఓ, ఎండీ, ఎల్అండ్టీ మెట్రో
ఢిల్లీ, బెంగళూరులో మెట్రో రైడ్ సేవలు : గిరీష్ నాగ్‌పాల్
మెట్రో ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్ ఆటోల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. డబ్ల్యుఆర్ఐ, షెల్ ఫౌండేషన్ సంస్థల సహకారంతో హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్ల నుంచి ఎలక్ట్రిక్ ఆటోలను నడుపనున్నాం. వీటి ద్వారా ప్రతియేటా 10లక్షల మంది ప్రయాణించేలా చర్యలు తీసుకోనున్నాం.