సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం గత ఏడాది నవంబరులో ముగిసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నిక వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికను పట్టించుకోలేదు. చివరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ఎన్నిక ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎట్టకేలకు గురువారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
శనివారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా..ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు (25వ తేదీ తప్ప) జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఔత్సాహికులు ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. వచ్చే నెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 7వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక పక్రియను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని పేర్కొన్నారు.