సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల విధులంటే రాత్రింబవళ్లు కష్టపడి, అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తి చేసిన మున్సిపల్ కాంట్రాక్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా వంచిస్తున్నారని తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడుస్తున్నా నేటికి దానికి సంబంధించిన బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంపై కాంట్రాక్టర్లు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా కిందిస్థాయి సిబ్బంది ఫైళ్లను తొకిపెడుతూ వివక్ష చూపిస్తున్నారని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి సాయి కిరణ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సాయి కిరణ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌంటింగ్ హాల్స్, డీఆర్సీ సెంటర్లు, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతా ఏర్పాట్లు, లేబర్ సైప్లె రవాణా (ట్రాన్స్ పోర్టేషన్) వంటి అత్యవసర సేవలను సుమారు 20 మందికి పైగా ఉన్న సామాన్య కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పూర్తి చేసినట్లు సాయికిరణ్ వివరించారు.రూ. 8,08, 17,135 కోట్ల పెండింగ్ చెకులను విడుదల చేయకుండా జీహెచ్ఎంసీ అధికారులు తొకిపెట్టారని మండిపడ్డారు.
ఆదేశాలున్నా కదలని ఫైల్..
న్యాయబద్ధంగా రావాల్సిన ఎలక్షన్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎన్నో రోజుల నుంచి ఉన్నతాధికారుల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూ వినతిపత్రాలు ఇస్తున్నా ఫలితం లేకుండా పోయిందని సాయి కిరణ్ తెలిపారు. ఇదే వ్యవహారంలో తట్టుకోలేక కొంతమంది కోర్టును ఆశ్రయించగా, వారికి మాత్రం జీహెచ్ఎంసీ ఫండ్స్ ద్వారా నాంపల్లి, అంబర్ పేట్, మలక్ పేట్ నియోజకవర్గాల బిల్లులను అధికారులు త్వరితగతిన క్లియర్ చేశారని చెప్పారు. వ్యవస్థను నమ్ముకుని, కోర్టుకు వెళ్లకుండా ఉన్న మిగతా హైదరాబాద్ పరిధిలోని కాంట్రాక్టర్ల చెకులు సిద్ధంగా ఉన్నప్పటికి పేమెంట్లు ఇవ్వకుండా నిలిపివేసి తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు వెళ్లిన వారికి ఏ విధంగానైతే జీహెచ్ఎంసీ ఫండ్స్ ద్వారా నిధులు చెల్లించారో, తమకు కూడా అలాగే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఇటీవల ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్లకు అసోసియేషన్ తరఫున తుది వినతిపత్రం సమర్పించినట్లు సాయి కిరణ్ వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పెషల్ ఆఫీసర్ కమిషనర్.. జీహెచ్ఎంసీ ఫండ్స్ ద్వారా నిధులు విడుదల చేయవచ్చని అంగీకరిస్తూ, ఏసీ ఎలక్షన్స్ సెక్షన్‌కు ఫైల్‌ను ఎండార్స్ చేసినట్లు తెలిపారు. అయినా కిందిస్థాయిలోని ఏసీ ఎలక్షన్ సెక్షన్ అధికారులు ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఎలాంటి నోట్ ఫైల్ పుటప్ చేయలేదని మండిపడ్డారు. అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల వడ్డీలు కట్టలేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటూ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ ఎన్నికలను బహిష్కరిస్తాం
అధికారుల ఉదాసీనత ఇలాగే కొనసాగితే, త్వరలోనే ఉమ్మడిగా న్యాయపోరాటానికి దిగుతామని కాంట్రాక్టర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విధులకు, పనులకు సంబంధించి ఏ ఒక కాంట్రాక్టర్ కూడా పాల్గొనకుండా, స్వచ్ఛందంగా ఎన్నికల పనులన్నింటిని పూర్తిగా బహిషరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే గ్రీన్ ఛానల్ ద్వారా పెండింగ్ బిల్లులను విడుదల చేసి, కాంట్రాక్టర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు.