బేగంపేట, ఏప్రిల్ 22: కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ప్రజలు ఆ పార్టీలకు ఓట్లెయ్యాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
నాలుగు నెలల కావస్తున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు మోసగించిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే వందకు పైగా ఉన్నాయని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు తాము చేసిన అభివృద్ధి ఒక్కటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించి.. అనేక కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు.
ఈ నెల 25న ఉదయం ప్యాట్నీ సర్కిల్లోని మహబూబ్ కళాశాల ఎస్వీఐటీ ప్రాంగణంలో సనత్‌నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ హాజరవుతారని చెప్పారు. అంతకుముందు ఎన్నికల ప్రచార రథాలను తలసాని జెండా ఊపి ప్రారంభించారు. సమావేశంలో కార్పొరేటర్లు మహేశ్వరి, లక్ష్మి, హేమలతతో పాటు మాజీ కార్పొరేటర్లు రూప, శేషుకుమారి, నాయకులు శ్రీహరి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.