ACB | శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడి నుంచి రూ. 50 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయాడు ఓ అవినీతి అధికారి. శుక్రవారం సెంట్రల్ యూనివర్సిటి బస్ డిపో సమీపంలోని గచ్చిబౌలి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకుంటుకున్న అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… గోపన్‌పల్లి సాయి నగర్ హౌసింగ్ కాలనీలో అపార్ట్మెంట్ల నిమిత్తం ట్రాన్స్ఫార్మర్స్ కావాలని ఓ వినియోగదారుడు విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం వర్క్ కంప్లీషన్ ఆర్డర్ కాపీతో జనవరి 28న గచ్చిబౌలి ఏడిఈ కొట్టే సతీష్ చాంబర్‌కు చేరుకుంది. సదరు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలంటే మొత్తం రూ. లక్ష లంచం ఇవ్వాలంటూ సతీష్ సదరు వినియోగదారుడి నుంచి లంచం డిమాండ్ చేశారు.
దీంతో ఫిబ్రవరి 6వ తేదీన రెండు ట్రాన్స్ఫార్మర్లకు కలిపి రూ. 75000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీన అడ్వాన్స్ రూపంలో రూ. 25000 ఏడీఈ సతీష్‌కు చెల్లించాడు. మిగతా రూ. 50 వేలు చెల్లించేందుకు శుక్రవారం మధ్యాహ్నం గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపో సమీపంలోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం కార్యాలయం వద్ద మాటు వేసింది. ఏడిఈ సతీష్ కుమార్ కాంట్రాక్టర్ నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్ హ్యాండెడ్‌గా సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.