సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలో చేరిన కొడుకు వద్ద ఉండలేక.. సొంత ఊరికి పోదామని వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. తల్లి కన్పించడం లేదంటూ మరో కొడుకు అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు వెంటనే తీసుకోకుండా తాత్సారం చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించేందుకు ఎనిమిది గంటలు ఆలస్యం చేశారు. దీంతో హైదరాబాద్ తెలియని ఆమె ఎక్కడెక్కడో తిరిగింది.. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రాత్రులు సీసీ కెమెరాల ఆధారంగా నగరంలో ఆరు రోజుల పాటు వెతికారు..
ఆమె నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కన్పించాయే తప్ప ఆమె మాత్రం దొరకలేదు. అయితే ఉస్మానియా నుంచి వెళ్లిన ఆమె నగరంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రెండు రోజుల తరువాత ఎల్బీనగర్లో ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందింది. ఆ మృతదేహాన్ని గుర్తుతెలియని శవంగా ఉస్మానియా మార్చురీలోనే భద్రపరచగా, అదే దవాఖానలో కొడుకు చికిత్స పొందుతూ ఉన్నా… మూడు రోజుల పాటు తల్లి చనిపోయిందనే విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియలేదు. ఆమె కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అదే దవాఖానలో తమ తల్లి అనాథ శవంగా పడి ఉందనే విషయం తెలియదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పోలీసుల నిర్లక్ష్యం… సమన్వయ లోపాన్ని స్పష్టంగా చెబుతున్న హృదయ విధారకరమైన సంఘటన ఇది… బాధితుల కథనం ప్రకారం…
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన మల్గిరెడ్డి వెంకటనర్సమ్మ(75)కు ఇద్దరు కొడుకులు మల్గిరెడ్డి కృష్ణారెడ్డి, మల్గిరెడ్డి బుచ్చిరెడ్డి. ఈ నెల 8వ తేదీ కృష్ణారెడ్డికి కిడ్నీ, గుండె సంబంధిత ఇబ్బందులు ఉండడంతో చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలో చికిత్స కోసం చేరాడు. ఆయన వద్ద తల్లి నర్సమ్మ, చిన్న కొడుకు బుచ్చిరెడ్డి ఉన్నారు. దవాఖానలో ఉండలేకపోయిన ఆమె 10వ తేదీ ఉదయం 7.45 నిమిషాల ప్రాంతంలో చిన్న కొడుకు టిఫిన్ కోసం బయటకు వెళ్లగా ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి సొంత ఊరికి పోదామని బయటకు వెళ్లింది.
5 నిమిషాల వ్యవధిలోనే చిన్న కొడుకు బుచ్చిరెడ్డి అక్కడకు వచ్చే వరకు తల్లి కన్పించలేదు. అక్కడున్న వారు ‘మీ అమ్మ బ్యాగ్ తీసుకొని వెళ్లిపోయిందం’టూ చెప్పారు. ఆమె వద్ద ఫోన్ లేకపోవడం.. హైదరాబాద్‌పై అవగాహన లేకపోవడం, ఆమె సొంత గ్రామం, సొంత ఊరు చుట్టు పక్కల ఊర్ల పేరు మాత్రమే ఆమెకు తెలుసు, వృద్ధురాలు కావడంతో తల్లి ఎక్కడ పోతుందోనని దవాఖానాల పరిగెత్తుతూ కలియ తిరుగుతూ పక్కనే ఉన్న అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు 8 గంటల ప్రాంతంలోనే వెళ్లి తన తల్లి కన్పించకుండా పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. ‘సార్ వెంటనే సీసీ కెమెరాలు చూస్తే ఇక్కడక్కడే ఉంటుందని బతిమాలాడు.. లేదు.. మీరు వెళ్లి దవాఖాన పరిసర ప్రాంతాల్లో బాగా చూసి రండంటూ బుచ్చిరెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు.
ఆయన ఉస్మానియా దవాఖాన పరిసర ప్రాంతాలు, బేగంబజార్ పరిసరాల్లో రెండు గంటల పాటు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఉదయం 10 గంటల సమయంలో తిరిగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించే వాళ్లు లేరని చెప్పారు. అయితే బుచ్చిరెడ్డి బతిమాలడడంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సై ఉస్మానియా గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ఉదయం 7.28 ప్రాంతంలో ఒక వృద్ధురాలు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యం కన్పించింది. ముఖం సరిగ్గా కనబడకపోవడంతో బుచ్చిరెడ్డి.. ఏమో సారూ.. ఇంకో కెమెరా ఉంటే చూడండి క్లారిటీగా ఉంటుందంటూ కోరాడు. అయితే ఆ ఎస్సై సీసీ కెమెరాలను చూడడం తనకు అంతగా తెలియదని.. ‘నాకు ఇతర కేసులున్నాయి..
సీసీ కెమెరాలు చూసే అతను వచ్చిన తరువాత చూద్దామం’టూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బుచ్చిరెడ్డి పరిసర ప్రాంతాలు తిరుగుతూ తనకు తెలిసిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసికెళ్లాడు. ఆయన అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫోన్ చేసి వృద్ధురాలికి హైదరాబాద్ గురించి తెలియదని కొద్దిగా వేగంగా గాలింపు చేపట్టండంటూ పోలీసులను కోరారు. దీంతో సాయంత్రం 4 గంటలకు సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించడం ప్రారంభించారు. ఉదయం 7.43 నిమిషాల ప్రాంతంలో ఆమె గేట్ వద్ద నుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు కన్పించాయి. దీంతో ఆమె కొడుకు బుచ్చిరెడ్డితో పాటు సీసీ కెమెరాలపై అవగాహన ఉన్న సిబ్బందిని ఇచ్చి ఆమె ఏ రూట్లో వెళ్లిందో అఫ్జల్‌గంజ్ పోలీసులు గాలింపు చేపట్టారు.
10వ తేదీ సాయంత్రం నుంచి 16వ తేదీ వరకు గోల్కొండ, అత్తాపూర్, నార్సింగ్ తదితర ప్రాంతాల్లో వెతుకుతూ వెళ్లారు. అక్కడక్కడ సీసీ కెమెరాల్లో ఆమె రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాలు కన్పించాయి. ఆ కెమెరాలను అనుసరిస్తూ వెళ్లగా.. ఆమె కోఠి, దిల్సుఖ్నగర్ వైపు వెళ్లిన దృశ్యాలు కన్పించాయి. కానీ ఆమె ఆచూకీ మాత్రం తెలియలేదు. నర్సమ్మ మిస్సింగ్ అయ్యిందని ఆచూకీ చెబితే లక్ష రూపాయల నజరానా కూడా ఇస్తామంటూ కుటుంబ సభ్యులు 15వ తేదీన ప్రకటించారు. ఇలా నగరంలో పగలు, రాత్రి వర్షాలు పడుతున్నా, పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తూ వృద్ధురాలి కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.
13న ఆమె ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలో నల్గొండ వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వాహనం ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పంపించారు. అదే దవాఖానలో ఆమె పెద్దకొడుకు చికిత్స పొందుతుండగా.. తల్లి కోసం చిన్న కొడుకు వెతుకుతూ ఉన్నాడు. నగరమంతా వెతికి వచ్చి దవాఖాన పరిసరాలలో ఎక్కడైనా ఉంటుందోమోననే అనుమానంతో అక్కడ కూడా వెతికాడు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అఫ్జల్‌గంజ్‌లో ఆమె మిస్సింగ్ కేసు నమోదయ్యింది. పక్కనే ఉన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్లో ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
పోలీసుల సమన్వయ లేమితో ఆమె మూడు రోజుల పాటు గుర్తుతెలియని మృతదేహంగానే మార్చురీలో ఉంది. అఫ్జల్‌గంజ్ పోలీసులు మిస్సింగ్ కేసులు ఉన్నాయంటూ కేసు దర్యాప్తు చేసే అధికారులు ఫొటోలు తెలిసిన వారికి పంపిస్తూ, ప్రకటనలు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ పోలీసులకు అఫ్జల్‌గంజ్‌లో మిస్సింగ్ అయిన వృద్ధురాలి ఫొటోను పరిశీలించారు. ఆ వివరాలతో ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఒక సారి ఉస్మానియాకు రావాలని సూచించారు. తాము ఉస్మానియాలోనే ఉన్నామంటూ కుటుంబసభ్యులు చెప్పారు.
16న ఎల్బీనగర్ పోలీసులు మార్చురీలో నర్సమ్మ మృతదేహాన్ని ఆమె కొడుకుకు చూపించడంతో ఆమె తమ తల్లేనంటూ బోరుమన్నాడు. తన తల్లి కోసం వెతకని జాగ లేదని… మూడు రోజులుగా ఇక్కడే అనాథ శవంగా పడి ఉందంటూ రోదించాడు.. 10న పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరాలను పరిశీలించి ఉంటే.. తన తల్లి ప్రాణాలతో దక్కేదని, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించడం ఆలస్యం చేయడంతోనే ఆమెకు పట్నం తెలియక సొంతూరికి పోయేందుకు నగరమంతా తిరుగుతూ ప్రమాదానికి గురయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
పోలీసుల నిర్లక్ష్యమే వృద్ధురాలి ప్రాణం తీసిందా? అంటే నిజమేనంటూ సామాన్య పౌరులు పోలీసుల వైఖరిని ఎండగడుతున్నారు. పట్నం తెలియని వృద్ధురాలి గూర్చి… వెంటనే ఉదయం 8 గంటలకే సీసీ కెమెరాలను పరిశీలించి ఉంటే ఆమె అక్కడే దొరికేది. టెక్నాలజీని పోలీసులకు సమకూర్చింది ఎందుకు.? టెక్నాలజీని ఉపయోగించి వేగంగా ప్రజలకు సేవలు చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. కానీ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించే ఓపిక లేకుండా సిబ్బంది ఉండడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఉస్మానియాకు వచ్చిపోయే గేట్ వద్ద సీసీ కెమెరాలను పరిశీలించి ఉంటే వెంటనే ఆమె దొరికేది.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుడిని పంపించి వేయడంతోనే సమయం వృథా అయ్యింది. మిస్సింగ్ కేసుల్లో వేగంగా స్పందించాల్సిన అవసరమున్నా… కొందరు పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ప్రాణాలతో ఉండాల్సిన వాళ్లు.. ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగితే గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన సమయంలో మృతదేహాన్ని పరిసర కమిషనరేట్లు, జిల్లాల పోలీస్స్టేషన్లకు పంపించే వ్యవస్థలు ఉన్నా.. అలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మార్చురీలో నర్సమ్మ మూడు రోజులు అనాథ శవంగా కొడు కు చికిత్స పొందుతున్న దవాఖాన ఆవరణలోనే పడి ఉంది.